కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా చివరకు జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. అనేక వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రూపొందించబడింది. ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయాలు వాటి ప్రభావాలు దేశంలో ఏర్పడిన మార్పులను ఈ సినిమాలో ప్రదర్శించారు. కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటించగా అనుపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్‌గా శ్రేయాస్ తల్పడే అటల్ బిహారీ వాజ్‌పేయీగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ సినిమా దాదాపు రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా థియేట్రికల్ రన్‌లో కేవలం రూ.21 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసిందని సమాచారం. భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కథన శైలి రాజకీయ అంశాల ప్రదర్శన కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నా సమగ్రంగా చూస్తే సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది. సినిమా విషయానికి వస్తే ఇందులో చూపించిన కొన్ని ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల మెప్పు పొందడంలో తడబడింది. ఫలితంగా ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో లాభాలను రాబట్టలేకపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీ రిలీజ్‌పై కంగనా రనౌత్ అధికారికంగా ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన అనౌన్స్‌మెంట్‌లో ఎమర్జెన్సీ మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ వేదికపై ప్రేక్షకుల నుంచి ఏ మేరకు స్పందన అందుకుంటుందో చూడాలి.