మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం విశ్వంభరా, బింబిసార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమాను సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని చిత్రబృందం భావించినా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. ముఖ్యంగా చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు అనుకూలంగా విడుదల తేదీ మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మరో కీలక కారణం కూడా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి అదే గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపర్చడం.
విశ్వంభరా పక్కా సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతంలో దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో గ్రాఫిక్స్ విషయమై కొన్ని విమర్శలు రావడంతో టీమ్ మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా తగినంత సమయం తీసుకుని హై స్టాండర్డ్స్‌లో సినిమాను రూపొందించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
సినిమా కథ విషయంలో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక విజువల్స్ పరంగా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతో మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో సినిమాకు అవసరమైన గ్రాఫిక్స్ పనులను మెరుగుపరచే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. మంచి అవుట్‌పుట్ వచ్చిన తరువాతే విడుదల తేదీ ప్రకటించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ దశలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి పాల్గొనగా ఇటీవలే కొన్ని పాటలను షూట్ చేశారు. ఇక మరో కొంత భాగం చిత్రీకరణ మిగిలి ఉండటంతో త్వరలోనే షూటింగ్ పూర్తిచేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
అందరూ ఎదురు చూస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పూర్తిగా గ్రాఫిక్స్ పనులు పూర్తయిన తరువాతే ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్క్స్ పూర్తయ్యాక విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.