తెలుగు సినీ పరిశ్రమలో రచయిత దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషీ మనోజ్ కూడా దర్శకుడిగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే తగిన శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే తన కుమారుడికి శిక్షణను స్వయంగా ఇవ్వకుండా అనుభవం కలిగిన ఇద్దరు దర్శకుల వద్ద నేర్చుకునేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం రిషీ ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడానికి సిద్ధమవుతున్నాడు.
గతంలో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నానూరి వద్ద రిషీ శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌డమ్ అనే సినిమా టీమ్‌లో రిషీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తికావస్తుండగా తదుపరి రిషీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు షిఫ్ట్ కానున్నాడు.
త్రివిక్రమ్ వ్యక్తిగతంగా ఓ పెద్ద దర్శకుడిని సంప్రదించి తన కుమారుడిని ఆ టీమ్‌లో చేర్చాలని కోరితే ఆ అవకాశం ఇవ్వకుండా ఎవరు ఉంటారు. అందుకే ఇప్పుడు రిషీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరనున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తైన తర్వాత రిషీ స్వతంత్ర దర్శకుడిగా మారే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇక పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా త్వరలో సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. రిషీ, అకీరా ఇద్దరూ ఒకే సినిమాలో డెబ్యూ అవుతారేమో అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పవన్, త్రివిక్రమ్ మధ్య ఉన్న స్నేహబంధం దృష్ట్యా ఇది అసాధ్యమేమీ కాదు. త్వరలోనే ఈ వార్తలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.