నందమూరి అభిమానులు మోక్షజ్ఞ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తారని ఒక సినిమా ఖచ్చితంగా మొదలవుతుందని ప్రచారం జరిగింది. మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే అనివార్య కారణాలతో అది నిలిచిపోయింది. ఈ తరుణంలో పలువురు దర్శకుల పేర్లు వినిపించగా బాలకృష్ణ స్వయంగా తనయుడిని వెండితెరకు పరిచయం చేస్తారని ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ఉంటుందని కానీ దానికి ఇంకా కొంత సమయం పట్టనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన జై హనుమాన్ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయ్యాక మోక్షజ్ఞ డెబ్యూట్ మూవీ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. దీనికి బాలకృష్ణ కూడా అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఇకపోతే ఈ గ్యాప్‌లో మోక్షజ్ఞ నటన ఇతరత్రా అవసరమైన శిక్షణ తీసుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జై హనుమాన్ ఒక భారీ ప్రాజెక్ట్. దీనిని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార 2 షూటింగ్ ముగిసిన తర్వాత ఈ సినిమాకు డేట్లు కేటాయిస్తారని సమాచారం. అయితే అప్పటివరకు ఆలస్యం కాకుండా ముందే షూటింగ్ మొదలుపెట్టాలని రిషబ్ శెట్టి తర్వాత ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట ప్రశాంత్ వర్మ.
ఈ సినిమాకు కనీసం 2025 మొత్తం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. అంటే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం అభిమానులు మరో సంవత్సరం ఓపిక పట్టాల్సిందే. మరి మోక్షజ్ఞ సినిమాను ఎలా ప్లాన్ చేస్తారు ఆ చిత్రంలో ఆయన ఎలా కనిపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.