సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ను వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆనందంగా జరిగింది. అయితే ఈ వేడుకకు వచ్చిన అతిథులు ఫోన్లు తీసుకురావద్దని ముందుగా స్పష్టమైన నిబంధన పెట్టడం వివాదాస్పదంగా మారింది. దీనిపై రకుల్ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు.
వివాహ ఫోటోలు, వీడియోలు బయటకు వస్తాయనే భయంతో ఫోన్లను నిషేధించామనే వార్తలు రావడం పట్ల రకుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవన్నీ అసత్యం అని స్పష్టం చేస్తూ పెళ్లి వేడుకను సింపుల్‌గా సంతోషంగా జరుపుకోవాలని అనుకున్నాం. అందుకే పరిమితమైన బంధువులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించాం అని తెలిపారు.
అలాగే పెళ్లికి హాజరైన వారు ఆ ప్రత్యేక క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలని ఆ సమయంలో ఫోన్లు, సోషల్ మీడియా కంటే ఆనందం ముఖ్యం అనే ఉద్దేశంతోనే నో ఫోన్ నిబంధనను పెట్టామని వివరించారు. తనకు విలాసం కంటే సౌకర్యం ముఖ్యమని చెప్పిన రకుల్ పెళ్లి అనంతరం ఫోటోలు, వీడియోలు తమే అధికారికంగా విడుదల చేశామని స్పష్టం చేశారు.
సినిమాల విషయానికి వస్తే రకుల్ ప్రీత్ ప్రస్తుతం మేరే హస్బెండ్ కీ బీవీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా బిజీ అవనున్నట్లు సమాచారం.