తాజాగా పూజా హెగ్డే పేరు పెద్దగా వినిపించడం లేదు. సినీ పరిశ్రమలో కొత్త నటీమణుల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు ఒక బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కూలీ సినిమాలో తెలుగు స్టార్ నాగార్జున కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటకు పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిత్రబృందం ఇటీవల ఆమెతో సంప్రదింపులు జరిపిందని పూజా కూడా ఈ పాటలో నర్తించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
పూజా హెగ్డేకు స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు రంగస్థలం, ఎఫ్ 3 చిత్రాల్లో కూడా ఆమె ప్రత్యేక గీతాల్లో ఆకట్టుకున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మాత్రం ఆమెకు ఇదే మొదటిసారి. పైగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ పాట ఆమెకు మరింత గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో ఉపేంద్ర, శృతి హాసన్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. వచ్చే ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పూజా హెగ్డే మరో పక్క లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న కాంచన 4 లోనూ నటిస్తోంది. అంతేకాకుండా ఆమె ఒక హిందీ చిత్రంలో నటిస్తుండగా సూర్య నటిస్తున్న రెట్రో సినిమాలో కూడా కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో కొత్త మలుపుగా మారుతుందా లేదా అనేది చూడాలి.