సిటాడెల్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చాక ఫ్యామిలి మ్యాన్3 షూటింగ్ లో సమంత కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసేసింది. అంతకు ముందే రాజ్ అండ్ డీకే పర్యవేక్షణలో సమంత నెట్ ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ చేస్తుంది. తుంబాడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ కోసం నెట్ ఫ్లిక్స్ కనివిని ఎరుగని బడ్జెట్ ఖర్చు పెడుతోంది.
తాజాగా రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ కి బ్రేక్ పడిందని తెలుస్తోంది. కారణం గత ఏడాది సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టిన రక్త్ బ్రహ్మాండ్ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోకుండానే యాభై శాతం బడ్జెట్ ఖర్చైపోవడం చూసి మేకర్స్ షాక్ తిన్నారట. బడ్జెట్ విషయంలో ఎవరికీ తెలియకుండానే కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దాని వెనుక ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని తెలుసుకుని దానిని విచారించే పనిలో పడ్డారట.
నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సిరీస్ ఇప్పటిదాకా కేవలం 26 రోజులు మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సమయంలో ఈ స్కామ్ బయటపడిందని సోషల్ మీడియా టాక్. మరోపక్క దర్శకుడు రహి అనిల్ బర్వే సెట్స్ లో అప్పటికప్పుడు చేస్తున్న మార్పులు చేర్పుల వల్ల కూడా బడ్జెట్ పెరుగుతూ వస్తోందట.
ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ కనిపించని స్థాయిలో దుబారా అవడంతోనే మేకర్స్ ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేకిచ్చి అది విచారించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.