జనవరి నెలలో బాక్సాఫీస్‌లో మంచి ఆదరణ పొందిన చిత్రాలతో ఫిబ్రవరి నెల ప్రారంభం అయింది. ప్రస్తుతం తండేల్ చిత్రం మంచి విజయాన్ని సాధించగా మిగిలిన రెండు వారాల్లో కూడా ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నెలలో లైలా సినిమా విడుదలైనప్పటికీ అది పెద్దగా ఆశించిన విజయం పొందలేదు. ఈ వారం నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వాటిలో రెండు వినోదాత్మక చిత్రాలు, మరొక రెండు నాన్న అనే అంశంతో అనుసంధానమైన కథలతో వస్తున్నాయి.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా లవ్ టుడే సినిమా తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ పొందింది. ప్రదీప్ లో ధనుష్ లుక్ కనిపించడం ఆయన పాత్రను తెలుగు ప్రేక్షకులు సులభంగా అంగీకరించడానికి కారణమైంది. ఇప్పుడు ప్రదీప్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా విడుదల కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ట్రైలర్‌లో యూత్ ఫ్రెండ్లీ అంశాలు కనిపిస్తున్నాయి వీటితో తెలుగు ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే హాస్యభరిత చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవీష్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో నటించారు. ప్రియా వారియర్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ చిత్రం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రం తెలుగు లో కూడా విడుదల అవుతుండడం టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావచ్చు.
బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన చిత్రం బాపూ. ఇందులో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం తండ్రి కొడుకు సంబంధం చుట్టూ తిరిగే కథను అనుసరిస్తుంది. ఇందులో ఎమోషన్, వినోదం మిళితంగా ఉంటుంది. ట్రైలర్‌లో బలగం చిత్రానికి అనేక సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఇది కూడా తన పాత్రలను బాగా అభివర్ణించే కథతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చు.
ధనరాజ్ దర్శకత్వంలో రామం రాఘవం సినిమా కూడా ఈ వారం విడుదల అవుతోంది. ఇందులో సముద్రఖని, ధనరాజ్ తండ్రి కొడుకుల పాత్రల్లో నటించారు. ఈ కథలో తండ్రి గౌరవం లేకుండా బతికే కొడుకు, వారి మధ్య జరిగే డ్రామాలు ప్రధానంగా ఉన్నాయి. బలగం సినిమాతో తన ముద్ర వేసుకొన్నాడు వేణు, ఇప్పుడు ధనరాజ్ సినిమాతో ప్రేక్షకులకు ఏం అందించగలరు అన్నది ఆసక్తి కలిగించే అంశం.