పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు ప్రమోషన్ లో కదలిక కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ పాడిన తొలి పాటను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా కొల్లగొట్టినాదిరో.. అంటూ సాగే ప్రేమ గీతాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదే కాకుండా సినిమాకు సంబంధించి విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ధీమాగా ప్రకటించారు. అయితే ఈ గడువులో సినిమా పూర్తవుతుందా..? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
సినిమా విడుదలకు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉండగా ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ పూర్తయినట్లు సమాచారం. అయితే చిత్రంలో ఓ కీలకమైన సీక్వెన్స్ షూట్ చేయాల్సి ఉంది. దీనికి పవన్ కాల్షీట్లు అవసరం. ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్‌కు హాజరు కావడం కష్టంగా కనిపిస్తోంది.
ఈనెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండటంతో పవన్ మరింత తీరిక లేకుండా పోనున్నారు. అయితే మార్చి రెండో వారంలో పవన్ కొంత సమయం కేటాయించినా ప్రణాళిక ప్రకారం షూటింగ్ ముగుస్తుందా..? అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే ఈ చిత్రం అనేక కారణాలతో ఆలస్యం కావడం అభిమానులను నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైన నేపథ్యంలో ఆయన అభిమానులు ఈ సినిమాను త్వరగా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సారి ఎటువంటి ఆటంకాలు లేకుండా మార్చి 28న హరి హర వీరమల్లు విడుదల అవుతుందా..? లేదా..? అనే విషయంపై సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమా ఎంత వరకు టైమ్ కీప్ చేస్తుందో వేచి చూడాలి..!