వల్లభనేని వంశీ నే కాదు ఇంకా కొంతమంది వైసీపీ నేతలు జైలుకెళ్లడం ఖాయం, కాదు పంపిస్తామంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన నేతలనెవ్వరిని వదలము, అరెస్ట్ చేస్తామంటూ బుద్ధా వెంకన్న హెచ్చరిస్తున్నాడు. వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీస్ లు హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ పై ఆరోపణలు ఉండగా, ఆ కేసులో బాధితుడిని కిడ్నాప్ చేశారనే అభియోగాలతో తాజాగా మరో కేసు నమోదు చేసి వంశీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న వంశీ బెడ్ కావాలని, నడుం నొప్పి కారణంగా కింద పడుకోలేనని, అలాగే వెస్టర్న్ కమౌడ్ బాత్ రూమ్ కావాలని పట్టుబడుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.
వంశీ అరెస్ట్ నేపద్యంలో ప్రెస్ మీట్ పెట్టిన బుద్ధా వెంకన్న కేవలం వల్లభనేని వంశీ మాత్రమే కాదు.. వైసీపీ లో ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబును సైతం అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారు. ఇప్పటికే కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్ళ పై కేసులు నమోదు కాగా వారు బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారు.