ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా భారీ సినిమాలేవీ రాలేదు కానీ, చిన్న సినిమాలు మాత్రం భారీగానే వచ్చి పడ్డాయి. రీ రిలీజ్ లు జరిగాయి. ఈ వారం రిలీజుల్లో చెప్పుకోదగ్గవి విశ్వక్ సేన్ లైలా, బ్రహ్మనందం తన కొడుకుని నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నం బ్రహ్మ ఆనందం. ఈ రెండు కూడా బాక్సాఫీసు వద్ద తేలిపోయాయి. మిగిలిన సినిమాలు పట్టించుకునే నాధుడు లేడు, థియేటర్ కు వెళ్లే ప్రేక్షకుడు లేడు. ఎక్కడికక్కడ షోస్ క్యాన్సిల్ అయ్యాయి.
గత వారం విడుదలై మంచి మౌత్ టాక్ తో ముందుకు వెళుతున్న తండేల్ కే ఈ వీకెండ్ కూడా అడ్వాంటేజ్ అయ్యింది. తండేల్ రాజు పాత్రలో నాగ చైతన్య ఒదిగిపోయిన తీరు, సత్య పాత్రలో సాయి పల్లవి చూపించిన జోరు తండేల్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయి. ఇదే టాక్ స్ప్రెడ్ అవడంతో ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం పై సర్వత్రా పాజిటివ్ టాక్ మాత్రమే కనిపించడం వలన ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కు కదిలారు. ఇప్పటికే దాదాపు 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన తండేల్ ఈ వీకెండ్ లో 100 కోట్ల గ్రాస్ అందుకోవడం స్పష్టం, సుస్పష్టం.