మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో కీలకమైన దశలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన నటించిన రెండు చిత్రాలు ఆచార్య గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ కలిగించడంతో మెగా అభిమానులంతా రామ్ చరణ్ తదుపరి చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే స్పష్టం అయినట్లుగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం కోసం చరణ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. కథలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు ఈ చిత్రానికి కీలకమని అవి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల కోసం ఆయన దాదాపు 10 కేజీల బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడట. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రస్తుత కాలంలో కనిపించే పాత్రలో చరణ్ సాధారణంగా ఉంటాడని కానీ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో మాత్రం 10 కేజీల తక్కువ బరువుతో కనిపించనున్నాడట.
ఒక నటుడిగా తను చేసే ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించాలనే తపనతో రామ్ చరణ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బరువు తగ్గడం అంత తేలికైన విషయం కాదు ప్రత్యేకమైన డైట్ కఠినమైన వర్కౌట్ రొటీన్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ, కథా పరంగా సుకుమార్ ప్రేరణ కూడా ఈ సినిమాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు మూడు ట్యూన్లు సిద్ధం చేశారని సమాచారం.
ఇక ఆర్సీ 16 తర్వాత రామ్ చరణ్ తన కెరీర్‌లో మరో భారీ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. రంగస్థలంతో మెగా ఫ్యాన్స్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించిన సుకుమార్ దర్శకత్వంలో చరణ్ మరొకసారి పనిచేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది.
రామ్ చరణ్ అభిమానులు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో వేచిచూడాలి.