అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచేలా తండేల్ సినిమా దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందట. దాదాపు 40 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో ఈ సినిమా విడుదల కాగా ఇప్పుడు ఆ లెక్కను పూర్తి చేసిందని చెబుతున్నారు. అధికారిక పోస్టర్ ఇంకా రాలేదనేమైనా ఇప్పటికి ఈ చిత్రం 70 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి విజయవంతంగా రన్ అవుతోందట.
ప్రస్తుతం నాగచైతన్య సాయిపల్లవి అలాగే నిర్మాతలు బన్నీ వాస్ అల్లు అరవింద్ సక్సెస్ టూర్‌లో బిజీగా ఉండటం వల్ల మూవీ అప్డేట్స్ ఆలస్యమవుతున్నాయి. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చైతూ కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇకనుంచి తండేల్ విజయాన్ని మరింత పెంచే కీలకమైన రెండో వారం ప్రారంభంకాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపుకు మంజూరు గడువు ముగియడంతో ఈ వారం ఆ స్థాయిలో కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ వారం కొత్తగా విడుదలవుతున్న సినిమాల్లో లైలా బ్రహ్మానందం ప్రధానమైనవి. అయితే వీటిలో పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వల్ల అవి పూర్తిగా టాక్‌పై ఆధారపడతాయి.
కొత్త సినిమాలు హిట్ అయినా తండేల్ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం తక్కువే. విశ్వక్ సేన్ చిత్రం ఏ సర్టిఫికెట్ పొందడం మరో సినిమా పూర్తిగా బ్రహ్మానందం పాత్రపై ఆధారపడడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు మొదటి ఎంపిక మళ్లీ తండేల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ సినిమా మొదటి రోజే హెచ్డి పైరసీ లీక్ అయినా ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించబడినా వాటిని అధిగమించి థియేటర్లలో మంచి వసూళ్లు సాధించడం విశేషం. టీమ్ ప్రమోషన్లు ఆపే ఉద్దేశ్యంలో లేరు పైగా మరింత బలంగా మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈనెల 21న కొత్తగా విడుదలయ్యే సినిమాలు మీడియం రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. దీంతో తండేల్ ప్రేక్షకాదరణను నిలబెట్టుకుంటే నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా 100 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తోంది. వీకెండ్ తర్వాత ఆ లెక్క సాధ్యమవుతుందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. నిర్మాత బన్నీ వాస్ కూడా దీని మీద పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.