ఫిబ్రవరిలో కొత్త సినిమాల హడావుడి మరింత పెరగనుంది. మొదటి వారంలోనే నాగచైతన్య నటించిన తండేల్ సినిమా విడుదలై అక్కినేని అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా చైతన్య కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్ సాధించడం విశేషం. ఇప్పుడు సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.
రెండో వారంలోనూ పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో విశ్వక్‌సేన్ నటించిన లైలా కూడా ఉంది. ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి స్త్రీ వేశంలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే టీజర్ ట్రైలర్‌లలో ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉందని స్పష్టమైంది. విశ్వక్‌సేన్ కూడా ఈ సినిమాపై చాలా కసరత్తు చేశాడు. తనకు హిట్ కావాలన్న ఆశతో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెంచి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవిని ఆహ్వానించడం ద్వారా సినిమాపై హైప్ పెంచేశాడు. ఇప్పుడు ఈ హైప్ ఓపెనింగ్స్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
బ్రహ్మానందం ఆయన కొడుకు గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మానందం కూడా ఈ వారమే విడుదలవుతోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ ఉంది. వెన్నెల కిషోర్ కూడా కలిసి నటించడంతో హాస్యరసానికి మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు. స్వధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా ఆ బ్యానర్ నుంచి వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో చేరతుందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది.
ఐదేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా ఇప్పుడు ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో థియేటర్లలోకి రాబోతోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఓటీటీలో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు సిద్దు పెరిగిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని దీన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. కానీ అప్పటికే ఓటీటీలో చూసిన ప్రేక్షకులు మళ్లీ టికెట్ కొట్టి థియేటర్‌కు వస్తారా? అనేది చూడాల్సిన విషయం.
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తల అనే సినిమా ఈ వారంలో విడుదల కానుంది. ఇందులో ఆయన కుమారుడు హీరోగా నటించాడు. ట్రైలర్‌లో యాక్షన్ ఎలిమెంట్స్‌ను బలంగా ప్రదర్శించడం విశేషం. ఇటీవల యాక్షన్ సినిమాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో తల కూడా హిట్ అవుతుందని చిత్రబృందం ధీమాగా ఉంది.