గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఊహించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను ఆకర్షిస్తూ మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో పొందగా ప్రస్తుతం హిందీ తప్ప మిగతా భాషల్లో ప్రసారం అవుతోంది. థియేటర్లలో ఊహించిన స్థాయిలో రాణించలేకపోయినా ఓటిటిలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఓటిటిలో విడుదలైన తర్వాత ఈ చిత్రంపై మళ్ళీ చర్చ మొదలైంది. కొన్ని సన్నివేశాలు టెక్నికల్ అంశాలకు ప్రశంసలు లభిస్తుండగా కొన్ని అంశాలపై విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఈ వివాదాలన్నింటినీ అధిగమిస్తూ గేమ్ ఛేంజర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారతదేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.
సంగీత దర్శకుడు థమన్ అందించిన సౌండ్‌ట్రాక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఓటిటిలో మంచి స్పందన పొందుతుండటంతో కొత్తగా చూసే ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వీక్షిస్తున్నారు.