సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు ఇది ఓ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ కానుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందుతుండటంతో అంతర్జాతీయ స్థాయి నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్, ప్రియాంక వర్క్‌షాప్‌లో పాల్గొన్నట్టు టాక్. సినిమా నిర్మాణానికి సంబంధించి రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట మహారాజ్, ఆ తర్వాత గరుడ అనే టైటిళ్లు తెరపైకి వచ్చాయి. అయితే రాజమౌళి కొత్తదానికి ప్రాధాన్యం ఇచ్చేలా మరో ఇంటర్నేషనల్ లెవల్ టైటిల్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జనరేషన్ కాన్సెప్ట్ ఆధారంగా ఓ గ్లోబల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ తరతరాల అనుబంధంతో సాగుతుందని అందుకే టైటిల్ కూడా తరతరాలకు కనెక్ట్ అయ్యేలా ఉండేలా నిర్ణయించనున్నారని టాక్.
ఈ సినిమా అన్ని విధాలుగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ప్రాజెక్ట్ కానుందని టాలీవుడ్ అంతటా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక అప్‌డేట్స్ ఎప్పటి నుండి వస్తాయో చూడాల్సి ఉంది.