రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు అర్జెంట్‌గా హిట్ కావాలి. ఆయన హిట్ ముఖం చూసి చాలా కాలం అవుతుంది. రష్మిక రూపంలో ఎప్పుడూ వార్తలలోనే ఉంటున్నా, సినిమాల పరంగా మాత్రం విజయ్ దేవరకొండ తన అభిమానులను ఖుషి చేయలేకపోతున్నాడు. ఇప్పుడతనికి ఒక సాలిడ్ హిట్ అవసరం. ఆ హిట్ కచ్చితంగా VD12తో వస్తుందని ఇటు విజయ్ మాత్రమే కాకుండా, ఆయన ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే, VD12 దర్శకుడి ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి.
విజయ్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న VD12 చిత్ర టైటిల్ రివీల్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ సినిమాపై విజయ్ అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. చాలా కాలంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం వారంతా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా అప్డేట్‌ని వదిలారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేస్తూ టీజర్ వదలబోతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు.
ఈ సినిమాకు టైటిల్‌గా ఇప్పటికే కొన్ని పేర్లు వినిపించాయి. మేకర్స్ టైటిల్ రివీలింగ్ డేట్ చెబుతూ విడుదల చేసిన పోస్టర్‌లో ఉన్న కిరీటాన్ని చూస్తుంటే.. ఈ సినిమాకు ఇప్పటి వరకు వినిపించిన టైటిల్స్‌లో సామ్రాజ్యం లేదా కింగ్‌డమ్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఈ సినిమా టైటిల్ అవుతుందా.. లేదంటే మరొక టైటిల్ ఏదైనా ఫిక్స్ చేశారా అనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు.