కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతార 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కాంతార కి ప్రీక్వెల్‌గా రూపొందుతుండగా హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ దృశ్యాన్ని పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. రిషబ్ శెట్టి దర్శకుడిగా, నటుడిగా ఒకేసారి వ్యవహరించడం సులభమైన పని కాదు. కానీ ఆయన తన అనుభవంతో సినిమాను అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో రిషబ్ శెట్టి ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. స్క్రీన్‌పై అత్యుత్తమ ఫైట్ సీన్స్ అందించేందుకు కళరిపయట్టు, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి కళల్లో ప్రత్యేకంగా మెళకువలు నేర్చుకున్నాడు. నైపుణ్యం కలిగిన శిక్షణదారుల సారధ్యంలో ఈ తర్ఫీదును పూర్తి చేశాడు. ఈ శిక్షణ ఫలితంగా ఆయన యాక్షన్ సీన్స్ మరింత గొప్పగా ఉండే అవకాశం ఉంది.
తాజాగా ఈ గ్రాండ్ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ భాగం సినిమా హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఈ భారీ యుద్ధ సన్నివేశాన్ని 500 మంది ప్రొఫెషనల్ ఫైటర్లతో తెరకెక్కించనున్నారు. వీరందరూ యాక్షన్ కొరియోగ్రఫీలో ప్రావీణ్యం కలిగినవారే కావడంతో ఫైట్ సీన్స్ అత్యద్భుతంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వార్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన లొకేషన్‌ను ఎంపిక చేశారు. కానీ ఇప్పటివరకు ఆ వివరాలను గోప్యంగా ఉంచారు. భారీ సెట్స్, అధునాతన ఆయుధాలు, ప్రత్యేక ఎఫెక్ట్స్ వాడుతూ యుద్ధ సన్నివేశాన్ని అద్భుతంగా మలచనున్నారు. బాహుబలి సినిమాలోని కాళకేయులతో జరిగిన యుద్ధ సీన్ తరహాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం టీమ్ పూర్తిగా ఈ యుద్ధ దృశ్యాలపై దృష్టి సారించింది. చిత్రీకరణకు అవసరమైన ఆయుధాలు, ఫైటింగ్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ సిద్ధం చేశారు. ఈ సన్నివేశాన్ని పూర్తి చేస్తే మొత్తం సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తవుతుందని యూనిట్ భావిస్తోంది.
ఇప్పటికే కాంతార 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా మూవీ 2 అక్టోబర్ 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను మరోసారి మంత్ర ముగ్ధులను చేయనున్నాడేమో చూడాలి.