పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొంతకాలంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. దీన్ని చివరి షెడ్యూల్ అని అనుకుంటున్నారు చాలామంది.
అయితే ఇందులో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేవలం మూడు రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. కానీ ఈ మూడు రోజుల్లోనే షూటింగ్ పూర్తవ్వడం కష్టమే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ గతంలో బ్లాక్ షూటింగ్‌కు కనీసం వారం రోజులు పడుతుందని ప్రకటించడం గమనార్హం.
ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ప్రధాన మార్పు జరిగింది. కొద్దిరోజుల క్రితం అనుపమ్ ఖేర్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అతను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో సత్యరాజ్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది హరిహర వీరమల్లు ప్రాజెక్ట్‌లో మూడో ప్రధాన మార్పు. ఇంతకు ముందు అర్జున్ రాంపాల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా బాబీ డియోల్ అతని స్థానాన్ని భర్తీ చేశారు. అలాగే దర్శకుడు క్రిష్ కూడా పూర్తిగా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టలేక మిగిలిన పనిని జ్యోతికృష్ణ చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్‌కు పవన్ మరికొంత సమయం కేటాయిస్తే ఈ నెలాఖరుకు మొత్తం షూటింగ్ (ప్యాచ్ వర్క్‌తో సహా) పూర్తయ్యే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ పనులు కూడా వేగంగా సాగితే సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.