పోలీసులపై మంత్రి లోకేష్ తీవ్ర అసహనం
అవును.. ఆంధ్రప్రదేశ్ ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పోలీసులపై తీవ్ర అసంతృప్తి, అంతకు మించి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఐతే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలీసులు ఎక్కడ చూసినా హడావుడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఖాకీలు, ఉన్నతాధికారులపై లోకేష్ అసహనం సీరియస్ అయ్యారు. ఎందుకు ఇంతమంది పోలీసులు ఉన్నారు..? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరంతా..? అసలు ఇంతమంది సెక్యూరిటీగా రావాల్సిన అవసరం ఏముంది..? ఎందుకు వచ్చారు..? అని లోకేష్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
ఎందుకు ఇలా చేస్తున్నారు..?
బందోబస్తు పేరుతో పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయొద్దని పోలీసులకు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి నేతలు, మంత్రులను కలవడానికి రోజులు వందలాది మంది కార్యకర్తలు వస్తున్నారు. ఇవాళ కూడా పొలిట్ బ్యూరో సమావేశం ఉండటం, నేతలను కలవడానికి, అభిమాన నేత లోకేష్ కోసం, ఆయన్ను చూడటానికి అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారని సమాచారం. ఐతే.. ఇదే విషయాన్ని కొందరు లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో స్వయంగా కలుగజేసుకున్న మంత్రి సీరియస్ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రతి రోజు కార్యకర్తలు వస్తూ ఉంటారు.. వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టొద్దు అని లోకేష్ మరోసారి హెచ్చరించారు.
భారీగా మార్పులు..చేర్పులు
ఈ పొలిట్ బ్యూరో సమావేశంతో పార్టీలో ఊహించని రీతిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్న టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది. కాగా పార్టీలో మార్పులు తప్పవని ఇప్పటికే లోకేష్ ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మూడు పర్యాయాలకు మించి పార్టీ పదవులు ఉండకూడదని, తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు కూడా. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. టీడీపీ పొలిట్ బ్యూరోలో యువకులకు పెద్ద ఎత్తునే అవకాశం దక్కుతుందని చర్చ జరుగుతోంది.