సాయిరెడ్డి రాజీనామా.. మంత్రి పదవి మెగా నో!
జనసేన అగ్రనేత, మెగా బ్రదర్ నాగబాబు తనకు మంత్రి పదవి వద్దంటే వద్దని పట్టుబట్టారట. అవునా ఇదేంట్రా బాబోయ్ పిలిచి మరీ ఎమ్మెల్యేని చేసి మంత్రి పదవిలో కుర్చోబెడతామంటే వద్దనుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. మీరు వింటున్నది నిజమేనండోయ్. ఇప్పుడిదే అటు ఏపీ రాజకీయాల్లో.. ఇటు మెగా కాంపౌండ్‌లో పెద్ద చర్చే. ఎందుకంటే మంత్రి కాకుండా అంతకుమించే కావాలని ఆయన తహతహలాడుతున్నారని తెలిసింది. అప్పుడెప్పుడో ప్రకటించి ఇంతవరకూ మంత్రిని చేయకపోవడం, సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా నాగబాబుకు పెద్ద సువర్ణావకాశం అయ్యింది.
ఢిల్లీ కావాలి..!
పెద్దల సభలో అడుగుపెట్టాలి.. ఢిల్లీలో చక్రం తిప్పాలన్నదే నాగబాబు లక్ష్యంగా ఉంది. అందుకనే తొలుత ఎంపీగా పోటీ చేయడం, ఆ తర్వాత ఓడినా 2024 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలని అనుకోవడం, సీటు దక్కకపోవడంతో సైలెంట్ ఆయినా మళ్ళీ రాజ్యసభలో మూడు స్థానాలు ఖాళీ కావడంతో ఆశలు చిగురించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఐతే టీడీపీ రెండు, బీజేపీ ఒకటి పంచుకోవడంతో ఇప్పటికే పలుమార్లు త్యాగం చేసిన నాగబాబు.. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేశాడు. అతి త్వరలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కూడా. ఐతే నాగబాబు మాత్రం ఎందుకో మళ్ళీ మనసు మార్చుకున్నారు.
సాయిరెడ్డి రాజీనామాతో..
మంత్రి పదవి కంటే ఢిల్లీనే ముఖ్యమని నాగబాబు పట్టుబట్టి కుర్చున్నారట. ఇదే విషయాన్ని తమ్ముడికి కూడా చెప్పినట్టుగా సమాచారం. ఇప్పుడు ఎలాగో సాయిరెడ్డి రాజీనామా చేశారు కాబట్టి ఆ సీటు కూటమి పార్టీలకే దక్కుతుంది. సో.. అది జనసేనకే దక్కేలా గట్టిగా అడగాలని తమ్ముడిపై నాగబాబు ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇవాళ కాకపోయినా రేపుపొద్దున్న కేంద్రమంత్రి మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో ఇప్పటికే బీజేపీ, టీడీపీకి కేంద్రంలో పదవులు దక్కాయి కాబట్టి.. రానున్న రోజుల్లో కచ్చితంగా కేంద్రంలో జనసేన పార్టీకి ఛాన్స్ ఉంటుంది. అందులోనూ ఢిల్లీలో పరపతి పెంచుకోవడానికి ఇదే మంచి అవకాశం అని మెగా బ్రదర్స్ భావిస్తున్నారట. ఇందులో నిజం ఎంత..? ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో..? అటు ఢిల్లీకి వెళ్తారో..? చివరికి అమరావతికి మాత్రమే పరిమితం అవుతారో చూడాలి మరి.