టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. కళల రంగంలో ఆయనకు ఈ పద్మ అవార్డు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే ముందు ప్రకటించింది. ఈయనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో నలుగురిని పద్మ అవార్డులు వరించాయి. ఇక తెలంగాణ నుంచి ఇద్దరికి అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి బాలయ్యకు పద్మ భూషణ్, కేఎల్ కృష్ణ (విద్యా రంగం) కు పద్మ శ్రీ, మాడుగుల నాగఫణి శర్మ (కళా రంగం), మిర్యాల అప్పారావు (ఆర్ట్స్) పద్మ శ్రీ, వదిరాజ్ రాఘవేంద్ర చార్య పంచముఖి (సాహిత్యం, విద్య) పద్మ శ్రీ అవార్డులు వరించాయి. ఇక తెలంగాణ నుంచి మందా కృష్ణ మాదిగ (ప్రజాసేవ)కు పద్మ శ్రీ, దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి (మెడిసిన్)కి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తమిళనాడు నుంచి ఎస్. అజిత్ కుమార్‌కు కళల రంగంలో పద్మ భూషణ్ వరించింది.
ఎన్టీఆర్‌కు లేదేం?
కాగా, తండ్రి ఎన్టీఆర్‌కు ఎలాంటి అవార్డు దక్కకపోయినప్పటికీ, బాలయ్య పద్మ భూషణ్ రావడంతో నందమూరి అభిమానులు కాస్త హ్యాపీగానే ఫీలవుతున్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా అన్నగారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసిన కేంద్రం, ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.