సాయిరెడ్డిని లైట్ తీసుకున్న వైసీపీ, జగన్!
అవును.. ఎంపీ విజయసాయి రెడ్డిని వైసీపీ, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్సలు లెక్కచేయట్లేదు.. చాలా అంటే చాలా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే పార్టీలో నంబర్ 02గా ఉన్న కీలక నేత రాజీనామా చేసిన తరవాత కనీసం వైఎస్ జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఐతే లండన్ పర్యటనలో ఉన్న జగన్ మాత్రం అధిష్టానంకు కీలక సందేశం పంపారు. పార్టీలో ఎవరు ఉన్నా.. లేకున్నా నష్టం లేదు ఇప్పటికే చాలా మంది పోయారని, ఆ జాబితాలో ఈయన కూడా చేరిపోయారు అంతే అని ముఖ్యనేతలతో మాట్లాడారు. ప్రజలు, క్యాడర్, అభిమానులు పైనున్న దేవుడే మనకు తోడు అన్నట్టుగా దిశా నిర్దేశం చేసినట్టుగా తెలిసింది. అందరూ పార్టీ బలోపేతంపై, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని లండన్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని అధినేత పిలుపునిచ్చారు.
ఇందులో కొత్త ఏముంది?
సాయిరెడ్డి రాజీనామాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. అంతేకాదు ఇదంతా ముందుగా ఊహించిన పరిణామమే అని, ఇందులో కొత్త ఏముంది? అని సీనియర్లు ఎదురు ప్రశ్నలు సంధించిన పరిస్థితి. మరోవైపు పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడానికి అధినేత సన్నాహాలు చేస్తున్నారని, చురుగ్గా పనిచేసే నేతలు, కార్యకర్తలకే పదవులు ఇస్తామని అధిష్టానం చెబుతోంది. మరోవైపు ఇప్పటికే దాదాపు జిల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాలకు అతి త్వరలోనే నియామకాలు జరుగుతాయని నేతలు చెబుతున్నారు.
అటు ప్రక్షాళన.. ఇటు పోరాటం!
కార్యకర్తలతో జగన్ సమావేశాల సమయంలో మండల, బూత్ లెవల్ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారని, ఒకవైపు ప్రక్షాళన, పునఃనిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడానికి జగన్ రెడ్డి సంసిద్ధంగా ఉన్నారని సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటికే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని, ఫిబ్రవరి 5న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల కోరుతూ ధర్నాలకు పిలుపునిచ్చారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు చంద్రబాబు సర్కారుకు జగన్ ఇచ్చిన టైం పూర్తయ్యిందని, ఇక ప్రజా పోరాటాలకు షురూ చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. జగన్ వరుస నిర్ణయాలతో వైసీపీలో నూతనోత్సాహం ఉందే తప్ప ఎలాంటి అసంతృప్తి అనేది లేదని చెప్పడానికి అధిష్ఠానం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.