వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీతో పాటు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది నిజంగా పార్టీకి, అంతకు మించి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని ఎదురు దెబ్బ. ఇంకా చెప్పాలంటే జగన్ నీడగా ఉన్న సాయిరెడ్డి అధినేతను వదిలి వెళ్ళిపోతున్నారనే మాటను కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నిన్న మొన్నటి వైఎస్ జగన్ వరకూ అటు ఆర్థిక లావాదేవీలు, ఇటు రాజకీయంగా సర్వం చక్కదిద్దేవారు. అలాంటిది అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారు..? రాజీనామా వెనుక ఏం జరిగింది..? ఢిల్లీలో ఏం నడిచింది..? ఇలా ఒకటా రెండా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
ఏమై ఉండొచ్చు..?
వైఎస్ జగన్ కేసుల్లో A2 గా జైలునే పంచుకున్న సాయిరెడ్డి, ఇప్పుడు పార్టీ, బాస్ కష్టాల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయడం ఏంటి? పోనీ విజయసాయికి ఏమైనా కష్టాలున్నాయా..? అంటే అబ్బే అస్సలు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే బయటికి వెళ్ళాల్సి వచ్చిందా అంటే అదీ కాదు.. ఎందుకంటే జగన్ రెడ్డికి ఎవరిని ఎక్కడ పెట్టాలి? ఎంతమేర ప్రాధాన్యత ఇవ్వాలి? అనేది బాగా తెలుసు..? సాయిరెడ్డి ముందు సజ్జల ఆఫ్ట్రాల్ అని ఆయనకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు చెబుతున్న మాట. అధినేతతో ఏమైనా తేడా కొట్టిందా..? అంటే అదీ భూకంపాలు, సునామీలు వచ్చినా ఇది అస్సలు జరగదని వైసీపీ నేతలతో కాస్త రాజకీయాలు గురుంచి తెలిసిన ఎవ్వరైనా ఇదే చెబుతారు. ఇవన్నీ కాదని ఇంకేం తేడా కొట్టినట్టు? అనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
కేసులు భయంతోనా..?
ఇవన్నీ కాదు సాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేశారా? అంటే వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసుల బెడద నుంచి బీజేపీ కాపాడుతూనే వస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీతో సంబంధం లేకుండానే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే ఈ ఇద్దరినీ కలిసే చనువు ఉంది కూడా. అలాంటప్పుడు కేసులకు భయపడి ఉంటారు అనుకుంటే అది అచ్చు తప్పు అని సాయిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. అటు సజ్జల కాదు.. ఇటు కేసులు కానే కాదు.. జగన్ రెడ్డితో గొడవలూ లేవు.. ఇవన్నీ కాదని ఇంకేముంటాయి..? అనే సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు.
ఐ ప్యాక్ కారణమా..?
కొందరు ఐ ప్యాక్ కారణం అని ఊదరకొడుతున్నారు. ఇందులో నిజం ఎంత అని ఆరా తీస్తే ఎలాంటి బేధాలు లేవని సాయిరెడ్డి ఆప్తులు చెబుతున్న పరిస్థితి. అవి కాదు.. ఇవి కాదు అంటున్నారే తప్ప అసలు విషయం మాత్రం బయటికి పొక్కడం లేదు. అదేమిటంటే మాకు కూడా ఎలాంటి సమాచారం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కారణాలు, నిజాలు ఎన్నో రోజులు దాగవు కదా.. బయటికి రాకుండా ఉండవు కదా. మరికొందరు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రా టూర్ ప్రభావం అని చెబుతుండగా.. రాజీనామాకు కొన్ని గంటల ముందు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో నిజ నిజాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా వైసీపీలో ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దాని భారీ నుంచి తప్పించుకోవడానికి సాయిరెడ్డి ఇలా చేసి ఉండొచ్చు...!