టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. తన సక్సెస్ ఫుల్ కెరీర్‌లో ఇప్పటికే 8 బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ విజయాన్ని సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ఈ విజయం యూనిట్‌ను ఆనందంలో ముంచెత్తగా చిత్రానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్న అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవితో లాక్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తిని కలిగిస్తోంది.
మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి రూపొందించే ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో అనిల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిరంజీవికి ఎలాంటి మెలోడీ పాటలు ఉంటే బాగుంటాయో అలాంటి సాంగ్స్‌ను ఇందులో తాను చేయబోతున్నానని, చిరు గ్రేస్ ఆ పాటలకు అదనపు ఆకర్షణగా మారుతుందని అన్నారు. ఆయన మాటల ప్రకారం వెంకటేష్ సినిమాల్లో పాటలకి ఉన్న ప్రాధాన్యతను చిరుతో కూడా అలాగే తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.
ఈ ప్రాజెక్ట్‌పై తాను చాలా హార్డ్ వర్క్ పెట్టబోతున్నానని, చిరంజీవి ఎనర్జీని, చరిష్మాను చూపించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతానని అనిల్ అన్నారు. మెగాస్టార్‌తో పనిచేయడం తనకు గర్వకారణమని, అభిమానులకు చిరస్మరణీయమైన చిత్రం అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ సినిమా కథ, పాటలు, చిరు డాన్స్‌పై ఆసక్తి మరింత పెరుగుతుండగా ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.