వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మనుగడపై ముసురుకున్న గాఢ మేఘాలు ఇక పూర్తిగా తొలిగిపోయినట్టే. 2024 ఎన్నికల హామీకి అనుగుణంగానే ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మనుగడను కాపాడే దిశగా మోదీ సర్కార్ కీలక నిర్ణయమే తీసుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను పునరుజ్జీవింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి చేయి అందించింది. కష్టాల్లో ఉన్న ప్లాంట్‌ను రక్షించడానికి రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఉక్కు మంత్రి కుమారస్వామి శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌కు పునర్‌వైభవం వస్తుందని కేంద్రం భావిస్తోంది.
రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక స్థానం..
ఈ మేరకు ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని వ్యాఖ్యానించారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈక్విటీ మద్దతును, రూ.10,000 కోట్లు ప్రకటించినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌ను నిర్మించడంలో విశాఖ ఉక్కు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించినట్లు మోదీ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో తుక్కుగా మారిపోవాల్సిన స్టీల్ ఇండస్ట్రీ మనుగడకు తాత్కాలిక ముప్పు తొలగినట్టేనని స్టీల్ ప్లాంట్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అన్నీ మంచి రోజులే..
స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం అని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటానికి నిలువెత్తు నిదర్శనమని, విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదన్నారు. విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులేనని చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. మోదీ సర్కార్ ప్రకటన ఫలితంగా ప్రైవేటీకరణ లేదా శాశ్వత మూసివేత ప్రమాదం నుంచి విశాఖ ఉక్కు బయటపడినట్లే.