జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు చెందిన టీవీ5 ఛానెల్ టార్గెట్ చేసింది. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పట్నుంచీ టీటీడీ ఛైర్మన్ మొదలుకుని ఈవో, అదనపు ఈవోతో పాటు ఇతర అధికారులు, పోలీసులపైన పవన్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని.. ఇంటికెళ్లి మరీ చెప్పాల్సిందేనని ఒకటికి రెండు, మూడు సార్లు బహిరంగంగానే సూచించారు. దీంతో పాటు తాను ఎలాంటి ఇగోకు పోకుండా అందరికంటే ముందుగానే ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పారు కూడా. అయితే క్షమాపణ చెబితే ఏం వస్తుంది? చనిపోయిన వాళ్లు బతికొస్తారా? అంటూ ఒకింత అసహనం, అసంతృప్తిగా.. అంతకుమించి పవన్ కళ్యాణ్‌ను కౌంటర్‌గా బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడటం గమనార్హం. ఎవరు పడితే వాళ్ల మాటలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని కూడా విసుగ్గా మాట్లాడారు. దీంతో రగిలిపోయిన జనసేన కార్యకర్తలు, నేతలు.. నాయుడిపై మీడియా, సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోశారా? ఎవరి గురించి, ఎవరితో మాట్లాడుతున్నావో కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేదా? అంటూ గట్టిగానే ఇచ్చి పడేశారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రకటన చేస్తూ.. తాను పవన్‌ను ఉద్దేశించి చేయట్లేదని టంగ్ స్లిప్ అయ్యారు.
టార్గెట్ చేసినట్లే..!
గత 24 గంటలుగా చూస్తే టీవీ5కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌లో పెద్దగా పవన్ కళ్యాణ్ వార్తలు, వీడియోలు కనిపించట్లేదు. కవరేజీ కూడా పెద్దగా లేదు. దీనికి తోడు పవన్ పిఠాపురం పర్యటనకు సంబంధించి ఇష్టానుసారం రాసేయడం, ఏది పడితే అది థంబ్ నెయిల్స్‌పైన హెడ్డింగ్ పెట్టేయడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక నిన్ను వదలం పవన్ అంటూ పరోక్షంగా డిప్యూటీ సీఎంకు టీవీ5 సంకేతాలు పంపినట్లు అర్థం చేసుకోవచ్చు. పిఠాపురం పర్యటనలో పవన్ మాట్లాడింది ఒకటి అయితే.. సంబంధం లేకుండా థంబ్ నెయిల్ పెట్టడం గమనార్హం. పవన్ కళ్యాణ్ వచ్చాకే దరిద్రం అంటూ టీవీ5 థంబ్ నెయిల్ పెట్టింది.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిందేంటి? టీవీ5 వక్రీకరించేంటి? అని ఏపీ రాజకీయాల్లో, జనసేన పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. మొత్తానికి చూస్తే బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలన్న కామెంట్స్‌పై టీవీ5 అండ్ కో ఉడికిపోతున్నట్లు దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తమ ఛానెల్ అధినేతనే క్షమాపణలు చెప్పాలని ఆదేశిస్తావా? అంటూ టీవీ5 ఇలా పవన్‌ను టార్గెట్ చేసిందని జనసైనికులు రగిలిపోతున్నారు. ఇప్పట్లో పవన్ వర్సెస్ బీఆర్ నాయుడు ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదు. మున్ముందు ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో? చివరికి ఏమవుతుందో చూడాలి మరి.