పవన్ అంటే బీఆర్ నాయుడికి లెక్కే లేదేంటి?
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే అధికారులు లెక్కలేకుండా పోతోందా? ఆయన మాట వినడానికి ఎవరూ సాహసించడం లేదా? కనీసం పరిగణనలోనికి కూడా తీసుకునే పరిస్థితి లేదా? అంటే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత గొంతు చించుకొని మరీ పవన్.. చనిపోయిన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని, అవసరమైతే మృతుల ఇంటికెళ్లి మరీ క్షమాపణలు చెప్పాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులకు సూచించారు. తిరుపతిలో మీడియా సమావేశం జరిపినప్పుడు, ఆ తర్వాత, పిఠాపురం పర్యటనలో ఇదే మాటను పదే పదే చెప్పారు డిప్యూటీ సీఎం. అయితే మృతుల ఇంటికెళ్లి క్షమాపణ చెప్పడం దేవుడెరుగు.. కనీసం మీడియా, సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పడానికి.. ఒక ప్రకటన చేయడానికి కూడా అస్సలు సాహసించలేదు. పైగా ఎందుకు చెప్పాలి? చెబితే చనిపోయిన వాళ్లు తిరిగొస్తారా? అన్నట్లుగా స్వయానా టీటీడీ ఛైర్మన్ మాట్లాడటం గమనార్హం.
కౌంటర్ అవసరమా?
తొక్కిసలాట ఘటన ముమ్మాటికి తప్పే. ఆరుగురు ప్రాణాలు అంటే ఆషామాషీ కాదు కదా. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా క్షమాపణలు చెబితే పోయేదేముంది? దీనికితోడు డిప్యూటీ సీఎంకే బీఆర్ నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమే చూడండి. అవును.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ఒకరిద్దరి పొరపాటు వల్ల ఘటన జరిగింది. విజిలెన్స్ రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మృతుల కుటుంబాలకు టీటీడీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. మేం నెపం ఎవరిపైనా నెట్టడం లేదు. క్షమాపణ చెప్పడంలో తప్పులేదు.. అయినా సారీ చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగిరారు. టోకెన్ల జారీలో పొరపాటు లేదని బీఆర్ నాయుడు మాట్లాడటం ఇప్పుడు అటు టీటీడీలో.. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
ఇది చూశారా?
మరోవైపు డిప్యూటీ సీఎం చెప్పిన మాటలు టీటీడీ పెడచెవిన పెడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైందని.. వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఒకింత టీటీడీపై పవన్ మండిపడ్డారు. వీఐపీ దర్శనాలపై దృష్టి పెట్టాలని గురువారం వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే శుక్రవారం నాడు ఉదయమే భారీ ఎత్తున వీఐపీ దర్శనాలకు టీటీడీ అనుమతించడం గమనార్హం. సామాన్యుల భక్తుల ప్రాణాలు పోతున్న తిరుమలలో వీఐపీ దర్శనాలు ఆపరా? అంటూ సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ టీటీడీ తీరుపై మండిపడుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారిని రాందేవ్ బాబా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ మంత్రులు మల్లా రెడ్డి, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు అనిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, ఎంపీ డీకే అరుణ, రాజ్య సభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సినీ నటులు బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి.. చాముండేశ్వరి నాథ్, బ్యాట్మెంటన్ పుల్లెల గోపీచంద్, ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఎంతోమంది వీవీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు.
ఎందుకిలా..!?
నిన్న, ఇవాళ రెండ్రోజులూ క్షమాపణ చెప్పాలని టీటీడీ అధికారులను పవన్ కోరారు. అంతేకాదు.. తాను కూడా స్వయంగా మీడియా ఎదుటే తప్పయింది.. క్షమించండి అని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలని ఆయనతో పాటు ఈవో, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలని కోరారు. అసలు సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు..? ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెబుతాం? అని కూడా పవన్ వ్యాఖ్యానించారు. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారని కూడా డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. అయితే పవన్ మాటలను కనీసం లెక్కచేయకపోవడం గమనార్హం. పోనీ సామాన్యుల దర్శనాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆ విషయాన్ని టీటీడీ ముఖ్యంగా ఛైర్మన్ పెడచెవిన పెట్టడం చర్చకు దారితీస్తోంది. అంటే ఏంటి.. డిప్యూటీ సీఎం అంటే లెక్కలేదా? సీఎం చంద్రబాబే ఏం అనలేదు.. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు రచ్చ చేస్తున్నారని బీఆర్ నాయుడు అనుకుంటున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.