నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వ్యవహారంలో ఎంతటి సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే తిరుమల కొండ కింద వైకుంఠద్వార దర్శనం టోకెన్ల విషయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందారు. దీంతో ఈ రెండు సంఘటనలను పోల్చుతూ మాజీ మంత్రి రోజా సెల్వమణి మాట్లాడటం గమనార్హం. గురువారం మీడియాతో మాట్లాడిన రోజా.. హైదరాబాద్‌లో పుష్ప సినిమా బెనిఫిట్‌షోకు హీరో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే దానికి అల్లు అర్జున్‌ని బాధ్యుడ్ని చేస్తూ బీఎన్‌ఎస్–105 సెక్షన్ కింద కేసు పెట్టడం జరిగిందని, ఆయనకు సంబంధం లేకుండా జరిగిన తోపులాటపై అంత సీరియస్‌గా తెలంగాణ ప్రభుత్వం స్పందించిందన్నారు.
బాధ్యులు ఎవరు?
అలాగే తిరుపతి తొక్కిసలాటల ఘటనలపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించాలి కానీ, తొక్కిసలాట ఘటనలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలిస్తే 105 సెక్షన్ కింద కేసులు పెట్టాల్సి ఉంటే.. 194 బీఎఎన్‌ఎస్ కేసులు పెట్టి ప్రమాదవశాత్తు జరిగిందంటూ చేతులు కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందని, అలాగే ఆ దర్శనం టోకెన్ల కోసం వచ్చే భక్తులకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని తెలియదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పరస్పర సహకారంతో చేయాల్సిన కార్యక్రమాన్ని నిర్లక్ష్యంతో గాలికొదిలేశారని, ఇదే భక్తుల మరణానికి కారణమైందన్నారు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే 194 బీఎఎన్‌ఎస్ కేసులు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారా? అని మండిపడ్డారు రోజా.
ఇంత ఘోరమా?
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశాం. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైంది. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారు..? భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదు. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారు. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారు. సనాతన యోధుడు ఈ ఘటనకు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు..? చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా.. మీరు చేస్తారా..? హోం మంత్రి కేవలం ఇతరులను తిట్టడానికి తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటానికి పనికి రావటం లేదు. తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలి. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు.