తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు (కేటీఆర్) ఉచ్చు బిగుసుకుంది. ఏ క్షణం అయినా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. ఇలాంటి పిటిషన్లలో క్వాష్ కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ అరెస్టుకు దర్యాప్తు సంస్థలు, పోలీసులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే.
కోర్టు కీలక వ్యాఖ్యలు..
ఫార్ములా ఈ- కారు రేసింగ్ కేసులో కొద్ది రోజులుగా కీలక పరిణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు ఈడీ విచారణకు హాజరవ్వడం, కేటీఆర్ గురుంచి కావాల్సిన కీలక సమాచారాన్ని అధికారులు సేకరించడం, ఆయన వంతు వచ్చేసరికి విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న పరిస్థితుల్లో పెద్ద హైడ్రామనే నడిచింది. దీంతో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం క్వాష్ పిటిషన్ కొట్టివేసినది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. అంతేకాదు ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించిన హైకోర్టు.. అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు ఐనట్టు అయ్యింది.
నెక్స్ట్ ఏంటి..?
అటు ఏసీబీ, ఇటు ఈడీ కేటీఆర్ కోసం వేట సాగిస్తున్న పరిస్థితి. ఇక హైకోర్టు కూడా ఎలాంటి ఊరట కలిగించే తీర్పు ఇవ్వని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నారని.. ఇప్పటికే తన లీగల్ టీమ్, ఢిల్లీలోని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ కేసులోని నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టడం, ఒక్కోరోజు ఒక్కో పరిణామం చోటు చేసుకున్న తరుణంలో విచారణకు హాజరు అయినా.. కాకున్నా అరెస్ట్ తప్పదని కేటీఆర్ అండ్ కో భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస పరిణామాలు చక చకా చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి చూస్తే మాజీ మంత్రి పీకల్లోతు కష్టాల్లో మునిగినట్టే అని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.