ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భారీగా మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. జనసేన తరపున మెగా బ్రదర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును కేబినెట్ లోకి అతి త్వరలోనే తీసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఐతే ఈయనకు ఇచ్చే మంత్రి పదవితో చాలా మార్పులు జరగబోతున్నాయని ఏపీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో కూడా ఊహించని రీతిలో పరిస్థితులు మారబోతున్నట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఏం జరుగుతుందో..?
మంత్రివర్గంలో హోం శాఖకు ఉన్న ప్రాధాన్యత గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాస్తవానికి ఈ శాఖను ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరని అంతా భావించారు కానీ, ఆయన ఎందుకో అంత సాహసం చేయలేదు. ఇప్పుడు మాత్రం హోం శాఖ తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నారు. గత ఐదారు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు, నేరాలు, ఘోరాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే శాంతి భద్రతలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఈ విషయం స్వయానా పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆందోళన చెందుతూ మాట్లాడటం, నాటి నుంచి రాష్ట్ర శాంతి భద్రతలో ఎంత మాత్రం మార్పు వచ్చిందో.. హోం మంత్రి ఎన్నెన్ని వివాదాల్లో చిక్కుకున్నారో అందరికీ తెలిసిందే.
బాబు ఓకే చెబుతారా..?
ఎలాగో ఆ శాఖను పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ దగ్గర ఉన్న శాఖలన్నీ కీలకమైనవి కావడంతో అవి కూడా వదులుకునే పరిస్థితి లేదు. అలాగనీ హోం శాఖకు వంగలపూడి అనిత కూడా న్యాయం చేయట్లేదని, నిర్లక్ష్యంతో వ్యవరిస్తున్నారనే అభిప్రాయం అటు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇటు పవన్ కళ్యాణ్ లోనూ ఉంది. దీంతో ఆమెను హోం మంత్రి పదవి నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఆ శాఖ ఏదో తన సోదరుడికి ఇవ్వాలని పవన్ గట్టిగానే పట్టుబట్టి కూర్చుచున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబును చేసే అవకాశం ఉందని అందరూ అనుకున్నా.. అటు నుంచి ఇప్పుడు హోం శాఖ దాకా వచ్చి ఆగింది. దీనికి బాబు నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
భారీగా మార్పులు ఇలా..?
హోం మంత్రి వివాదాల్లో ఇరుక్కోవడం, మరో ఆరుగురు మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉండటం, త్వరలోనే ఆ ఆరుగురిలో ముగ్గురిని పదవులు నుంచి తప్పించే యోచనలో చంద్రబాబు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. డేంజర్ జోన్ లో ఉన్నవారు అంతా ఇంచుమించు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు దక్కించుకున్న వారే అని తెలుస్తోంది. దీనికి తోడు హోం మంత్రి.. మరో మంత్రి హైదరాబాద్ వేదికగా సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ పరువు తీసాడని ఆయన మీదా ముఖ్యమంత్రి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో సదరు మంత్రితో పాటు హోం మంత్రిని కూడా పక్కనపెట్టి మార్పులు చేయడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. నాగబాబు పరిస్థితి ఏంటి..? ఒకవేళ హోం శాఖ ఆయనకే కట్టబెట్టాల్సి వస్తుందా..? కీలక శాఖను జనసేనకు ఇవ్వడానికి బాబు సుముఖంగా ఉన్నారా..? పోనీ హోం వాళ్లకు ఇచ్చేస్తే అనిత సంగతేంటి..? అసలుకే పదవి నుంచి తీసేస్తారా..? లేదంటే వేరే శాఖ ఏదైనా ఇచ్చి ప్రాధాన్యత తగ్గిస్తారా? ఈ ప్రక్షాళన అనేది ఎంత వరకూ జరుగుతుంది? అనేది చూడాలి మరి.