సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని పరామర్శించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి భారీ బందోబస్త్ నడుమ చేరుకున్నారు. తెలంగాణ ఎఫ్‌డిసి ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళ్లారు. అంతకు ముందు, ఆస్పత్రిలో ఉన్న బాబుని ఎందుకు పరామర్శించలేదంటూ అల్లు అర్జున్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
తనకు వెళ్లాలని ఉన్నా.. తన లీగల్ టీమ్ వద్దని చెప్పడంతో బాబుని చూసేందుకు రాలేదని అల్లు అర్జున్ మీడియా సమక్షంలో తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఎక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లి బాబుని కలిసి వస్తాడో అని, పోలీసులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అలా వెళ్లాలని చూసిన అల్లు అర్జున్‌కు పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు పోలీసుల నుండి అనుమతి తీసుకుని, బాబుని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఆయన వస్తున్న సందర్భంగా ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ని ఏర్పాటు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు అల్లు అర్జున్ ఆస్పత్రిలోనే ఉన్నారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది.