గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ మంత్రి హాట్ టాపిక్ అయ్యారు. ఏపీ నుంచి వచ్చి పక్కరాష్ట్రం తెలంగాణకు వచ్చి పలు విషయాల్లో జోక్యం చేసుకుని నానా రచ్చ చేస్తున్నారని సదరు మంత్రిపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఏకంగా హైదరాబాద్ వేదికగా దుకాణం తెరిచేసిన ఏపీ మంత్రి దందాలు, సెటిల్‌మెంట్లు స్వయానా తెలంగాణ ప్రభుత్వమే.. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ చెప్పిన పరిస్థితి. దీంతో అసలు ఆ మంత్రి ఎవరు? ఎందుకు ఇక్కడ ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అని తెలుసుకోవడానికి జనం అంతా తెగ ఆసక్తి చూపించారు. అయితే ఆయన మరెవరో కాదు రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అని తేలిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు గానా బజానా, కళా ప్రదర్శనతో రచ్చ రచ్చ చేసేవారని తేల్చేశారు.
బారులు తీరాల్సిందే..
వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉండే మంత్రి ప్రముఖ స్టార్ హోటల్‌లో దందాలు, సెటిల్‌మెంట్లు చేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రితో పనులున్నవారు, కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సినవారు ఆ హోటల్‌లో బారులు తీరాల్సిందే. ఆఖరికి తెలంగాణ భూవ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. దీంతో శ్రుతి మించుతోందంటూ చంద్రబాబుకు లేఖతో పాటు ఫోన్ కూడా చేసి మాట్లాడింది రాష్ట్ర ప్రభుత్వం. మీ మంత్రిని జర చూసుకోండి.. ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవీ బాగోలేవని స్వయానా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందంటే అదేమీ మామూలు విషయం కాదు. తెలంగాణ భూముల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారని, సెటిల్‌మెంట్లకు కౌంటర్ తెరిచారంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం చూడటం గమనార్హం. మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి.. అ పనులేవో అక్కడే (ఏపీలో) చేసుకోమనండి అంటూ చంద్రబాబుకు లేఖ రాసినట్లుగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు.
ఏం చేయబోతున్నారు?
మంత్రి అనగాని సత్యప్రసాద్ లీలలు, పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు ఏపీలో ప్రభుత్వం, ఇంటెలిజెన్సీ ఏం చేస్తోందో అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ దుకాణం పెట్టారంటే.. ఏపీలో ఏం తక్కువ చేసి ఉంటారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. సోషల్ మీడియాలో, ఓ వర్గం మీడియాలో తిట్టిపోసేస్తున్నారు. నివేదిక తెప్పించుకున్నారు సరే చంద్రబాబు ఏం చేయబోతున్నారు? మంత్రి పదవి నుంచి తప్పిస్తారా? లేకుంటే కొనసాగిస్తారా? ఇప్పటికే పలువురు మంత్రుల వ్యవహారంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. మొత్తం ఆరుగురు మంత్రులు ఔట్ అంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఇతను కూడా ఉన్నారన్నది ప్రాథమిక సమాచారం.