హీరో విశాల్ హెల్త్‌పై అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆదివారం ఆయన నటించిన మదగజరాజ సినిమా మీడియా సమావేశంలో మాట్లాడడానికి కూడా గజ గజ వణికిపోతుండటమే. దీంతో విశాల్‌కు ఏమైందో అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆందోళన చెందుతారని భావించిన విశాల్.. తన టీమ్ ద్వారా తనకు ఏమైందో తెలిపారు.
ఇంతకీ విశాల్‌కు ఏమైందంటే.. ఆయన కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, వైద్యులు ఆయనకు బెడ్ రెస్ట్ సూచించినట్లుగా ఆయన పీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆయన అభిమానులంతా త్వరగా విశాల్ కోలుకోవాలని ప్రార్థిస్తూ.. గెట్ వెల్ సూన్ అనే మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. అపోలో ఆస్పత్రి వర్గాలు కూడా విశాల్ హెల్త్‌పై బులిటెన్‌ను విడుదల చేశాయి. అందులోనూ ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, బెడ్ రెస్ట్ అవసరమని రాసి ఉంది.
విశాల్ మదగజరాజ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాపై ఇప్పుడు కాదు.. దాదాపు 12 ఏళ్ల నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో విడుదల, ఇదిగో విడుదల అంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ఈ సినిమాకు మోక్షం లభించబోతోంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్.. బక్క పలుచుగా మారిపోయి, కనీసం మైక్ పట్టుకోలేని పరిస్థితిలో కనిపించారు. విశాల్ సరసన అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన మదగజరాజ చిత్రానికి సుందర్ సి దర్శకుడు.