అవును.. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో, టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, అంతకు ముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాల విషయాల్లో రేవంత్ సర్కారు తీరు లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఆదివారం నాడు అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీ తేజ్‌ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో బన్నీ ఇంటికి వచ్చిన రాంగోపాల్ పేట పోలీసులు ఈ నోటీసులు అందజేశారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లొద్దు అన్నదే ఆ నోటీసులు ఉన్న సారాంశం. ఉదయాన్నే వచ్చిన పోలీసులు అల్లు అర్జున్ నిద్రలేవకపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి పోలీసులు నోటీసులు అందజేశారు.
ఇదేం పద్ధతి..?
బాధితుడిని పరామర్శ చేయలేదని తిట్టి పోసేది రాష్ట్ర ప్రభుత్వమే.. పోనీ వెళ్లి ఒక్కసారి చూసి వద్దాం అంటే పోలీసులు ఇలా నోటీసులు ఇచ్చారు. కలవలేదు అనడం ఎందుకు?, కలుస్తాను.. పరామర్శ చేస్తాను అంటే కలవకుండా ఆపడం ఎందుకు? అసలేం జరుగుతోంది. ఏమిటీ దారుణం..? ఇదేం పద్ధతి..? అని సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ కుట్ర మరోసారి బట్ట బయలు అయ్యిందని బన్నీ అభిమానులు, సినీ ప్రియులు మండిపడుతున్నారు. దీనికితోడు పొరపాటున బన్నీ అరెస్టుపై ఏదైనా కామెంట్ చేస్తే మళ్ళీ మరొక తలనొప్పి.
అన్నీ మీరే చెబుతారే..?
తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ కలవట్లేదు..? ఇదేం పద్ధతి..? అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. మరోవైపు.. బాధితుడిని కలవడానికి సాకులు చెబుతున్నాడు..? అన్నీ అబద్ధాలు చెబుతున్నాడు ఆఖరికి కనీసం జాలి, దయ లేదు? అంటూ బన్నీపై కాంగ్రెస్ నేతలు మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఆ తర్వాత రెచ్చిపోయి అల్లు అర్జున్ ఇంటిపై దాడి కూడా సీఎం అనుచరులు చేశారు కూడా. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలతో అడ్డంగా దొరికిపోయారు.
ఇదే ఉదాహరణ..
సీన్ కట్ చేస్తే ఆదివారం నిజం బయటపడిందని అల్లు అర్జున్ అభిమానులు కన్నెర్రజేస్తున్నారు. బన్నీ.. శ్రీతేజ్‌ను కలవకుండా ఎప్పటికపుడు కేసు పేరుతో ప్రభుత్వమే కుట్ర చేస్తూ, తిరిగి ప్రజలలో హీరో టార్గెట్‌గా క్యాంపెయిన్ చేశారనడానికి ఈ లెటర్ ఉదాహరణ అని అభిమానులు చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది..? పోలీసులు ఎలా రియాక్టు అవుతారు..? అనేది చూడాలి మరి.