శనివారం రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరుకి అర్థం ఏంటో, ఆ పేరు ఎవరు పెట్టారో తెలిపారు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్ చరణ్ గురించి ఈ వేదికపై మాట్లాడుతూ..
మేం ఆంజనేయ స్వామి భక్తులం. అన్నయ్య చిరంజీవిగారికి అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి, రామ్ చరణ్ అని పేరు పెట్టారు. అంటే అర్థం రాముని చరణాల వద్ద ఉండే వాడు.. ఎవరు హనుమంతుడు. ఆ ఆంజనేయుడిలానే ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు.. హనుమాది సిద్దులున్నా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు.. అందుకే రామ్ చరణ్ అని మా నాన్న పేరు పెట్టారు. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు.
సుకుమార్‌గారు తీసిన రంగస్థలం సినిమాకుగానూ రామ్ చరణ్‌కు అవార్డు వస్తుందని అనుకున్నాను. ఎందుకంటే, చరణ్‌కు చెన్నై, హైదరాబాద్ తప్పితే వేరే ఏ ఏరియా తెలియదు. ముఖ్యంగా గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ కాకుండా ఎలా ఉంటాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. చరణ్ కూడా అంత కీర్తి వచ్చినా.. అది గర్వంగా మారకూడదని సంవత్సరంలో ఓ 100 రోజులు అయ్యప్ప మాల, హనుమాన్ మాల ఇలా దీక్షలోనే ఉంటాడు.
రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెవిలో చెప్పా. దానికి ఒక చెఱుకు ముక్క, క్యారెట్ పెట్టాను. అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఆ శిక్షణ కోసం చిన్నప్పుడు ఉదయం 5 గంటలకే లేచి రెడీ అయ్యేవాడు. చాలా క్రమశిక్షణ ఉన్న మనిషి రామ్ చరణ్. అందుకే నేను చరణ్‌కి బాబాయ్‌ని కాదు.. అన్నయ్యని.
మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం.