సంక్రాంతి అంటే సినిమాలకు పెద్ద పండుగ. ఈ పండుగకి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. ఈసారి సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్‌గా, నటసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సాఫ్ట్ టైటిల్‌తో దిగుతున్నారు. అయితే ఇటీవల పుష్ప సినిమా నిమిత్తం ప్రదర్శించిన ప్రీమియర్‌కు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసింతే.
ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవడమే కాకుండా.. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడాలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా హుకుం జారీ చేశాడు. దీంతో సంక్రాంతి సినిమాలకు టికెట్ల ధర పెంపు ఉండే అవకాశం లేదు. కానీ ఏపీలో మాత్రం ఆల్రెడీ టికెట్ల ధరను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటుతో పాటు, ప్రీమియర్స్‌కు కూడా అనుమతి ఇచ్చింది. ఆ వివరాల ప్రకారం..
జనవరి 10న విడుదలకాబోతోన్న గేమ్ చేంజర్ సినిమాకు 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు మల్టీప్లెక్స్‌లో రూ. 175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 135 రూపాయలు పెంచుకునేలా వెసులుబాటును కల్పించింది. అలాగే మొదటి రోజు మొత్తంగా 7 షోలకు అనుమతి ఇచ్చింది. దీంతో అర్ధరాత్రి 1 గంట నుండే షోలు ప్రారంభం కానున్నాయి. అలాగే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 600 వరకు పెట్టుకోవచ్చని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే రోజు 4 గంటల నుండి నార్మల్ షోలు మొదలవుతాయని ఈ జీవోలో పేర్కొన్నారు. ఈ జీవో ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి చిత్ర టీమ్ ధన్యవాదాలు తెలిపింది.