చెన్నైలో ఉన్నప్పుడు డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన సినిమాను బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని మరీ చూశానని అన్నారు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ శంకర్ గురించి ఆయన మాట్లాడారు. శంకర్ సినిమాలలో మంచి సందేశం ఉంటుందని, సినిమా వాళ్లంతా బాధ్యతగా తీసుకుని, మంచి విలువలు ఉన్న సినిమాలు తీయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని మరీ చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశం ఉండేలా శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. తమిళంలో శంకర్ గారు సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇప్పుడు గేమ్ చేంజర్ రూపంలో తెలుగు సినిమా చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు.
గేమ్ చేంజర్ ట్రైలర్‌ని చూశాను. చాలా మంచి కంటెంట్ ఇందులో ఉందని అనిపించింది. సినిమా పెద్ద విజయం సాధించాలని.. యూనిట్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలి. ఆంధ్రప్రదేశ్ తరుపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు, శిరీష్ గార్లకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య గారు చాలా మంచి దర్శకులు. ఆయనలో మంచి నటులు కూడా ఉన్నారు. నటుడు కావాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నటుడిగా ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీంకు ఆల్ ది బెస్ట్.. అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.