నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న తండేల్ మూవీ నుండి సెకండ్ సింగిల్ విడుదల కావాల్సి ఉండగా.. పుష్ప 2 ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో నిర్మాత అల్లు అరవింద్ కొన్ని రోజుల పాటు ఆ పాటని వాయిదా వేశారు. డిసెంబర్ 22న విడుదల కావాల్సిన ఈ పాటను శనివారం విడుదల చేశారు.
నమో నమః శివాయ అంటూ సాగిన ఈ పాటను శివశక్తి సాంగ్‌గా మేకర్స్ వదిలారు. సీనియర్ గేయ రచయిత జొన్నవిత్తుల ఈ పాటకు సాహిత్యం అందించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి పౌర్ణమి సినిమాలో భరత వేదముగా వంటి పాట వైబ్‌ని తెప్పించేశారు. అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. ముఖ్యంగా సాయి పల్లవితో అద్భుతాన్ని క్రియేట్ చేసినట్లుగా ఈ లిరికల్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది.
నమో నమః శివాయ పాట కళాత్మక, ఆధ్యాత్మిక కలయికతో ఆ శివ పరమాత్ముని గ్లోరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేలా ఉంది. ఈ పాట బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచి కొంత కాలం పాటు నిలిచిపోనుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కార్తికేయ సిరీస్ చిత్రాల దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.