నాకేం తెలియదు.. గుర్తు లేనే లేదు!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు పేర్ని ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంది. ఓవైపు కోర్టుల్లో ఊరట లభిస్తున్నా.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూ మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరు మాత్రమే ఉండగా ఏ6గా నానీని కూడా పోలీసులు కేసులో చేర్చడంతో చిక్కులు తప్పేలా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే పీకల్లోతూ ఈ కేసులో ఫ్యామిలీ మునిగినట్లేనని సొంత పార్టీలోనే నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి. వైసీపీ తరఫున ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించే పేర్ని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న నాని పక్కా ఆధారాలతో, సరైన సమయంలో దొరకడంతో దుమ్ముదులిపి వదలడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసేసిందని, వదిలే ప్రసక్తే లేదని మంత్రుల వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ రెండే సమాధానాలు..
మరోవైపు కోర్టులో ఊరట లభించడంతో పోలీసు విచారణకు జయసుధ సహకరిస్తున్నారు. బుధవారం 2.30 గంటల పాటు విచారణ సాగింది. ప్రత్యేక విచారణాధికారి యేసుబాబు సమక్షంలో జరిగిన ఈ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆశించిన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఏం అడిగినా సరే తెలియదు.. గుర్తు లేదు అనే మాటలతో విచారణ సాగిందట. ఒకట్రెండు ప్రశ్నలకు మినహా ఎలాంటి సమాధానాలు రాలేదని సమాచారం. అయితే, విచారణలో మాత్రం పలు క్లిష్ట ప్రశ్నలు వేసి, నిజానిజాలు రాబట్టేందుకు యేసుబాబు ప్రయత్నం చేశారు. అయితే జయసుధ నుంచి మాత్రం సమాధానాలు రాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మానస్ తేజతో మరో ఇద్దరు ముగ్గుర్ని పోలీసులు విచారిస్తున్నారు. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసిన పోలీసులు.. జయసుధ నుంచే వచ్చే సమాధానాలతో సరిపోల్చనున్నారు. ఆ తర్వాతే ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీస్, సివిల్ సప్లై శాఖలు భావిస్తున్నాయి.
నాని వంతు ఎప్పుడో?
ఈ వ్యవహారంలో త్వరలోనే కీలక పరిణామం జరగొచ్చనే చర్చ నడుస్తోంది. నోటీసులు ఇచ్చి నానిని విచారణకు పిలుస్తారా లేకుంటే అరెస్ట్ చేస్తారా? అంటూ విజయవాడలో పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కాస్తుండటం గమనార్హం. చంద్రబాబు కేబినెట్‌లోని ఓ మంత్రి దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఏం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. నానిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరుతారని టీడీపీ శ్రేణులు హడావుడి చేస్తుంటే.. కక్ష తీర్చుకోవడం, టార్గెట్ చేయడం కూటమికి అలవాటే కదా అని వైసీపీ తిట్టిపోస్తోంది. ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే నాని నోరు మూయించడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా ఉందని వైసీపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ దెబ్బతో..
జయసుధ గోడౌన్ నుంచి మొత్తం 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. తొలుత రూ.1.68 కోట్లు జరిమానా చెల్లించగా ఆ తర్వాత మరోసారి మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించడం జరిగింది. ఈ ఒక్క ఘటనతో పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ గోడౌన్స్ తీసుకొని బియ్యాన్ని స్టోర్ చేయకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధింత అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రైవేట్ గోడౌన్స్ నుంచే బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.