2024 ఏడాది పూర్తయ్యి కొత్త సంవత్సరం 2025 లోకి అడుగు పెట్టేశాం. గడిచిన ఏడాదిలో సామాన్యుడు మొదలుకొని సినీ, రాజకీయ ఇలా అన్ని రంగాలవారికి ఎన్నో అనుభూతులు, అంతకు మించి చేదు అనుభవాలను మిగిల్చే ఉంటుంది. ఎందుకంటే కష్టం వెంటే సుఖం.. సుఖం వెంటే కష్టం అన్నది సర్వసాధారణంగా జరిగేదే. అలాగనీ అన్ని రోజులు కష్టాలు ఉంటాయా అంటే అదేమీ లేదు. గాయాలు, జ్ఞాపకాలు, గుణపాఠాలు మామూలే. ఇక గతేడాది సంగతి అటుంచితే ఈ ఏడాది ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఏపీలో గేమ్ ఛేంజర్ అయ్యేది ఎవరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
కోటి ఆశలు.. కొత్త ఊహలు!
2024 ఎన్నికల్లో ఎన్డీఏతో జత కట్టిన టీడీపీ.. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ 2024 ఎన్నికల్లో మాత్రం ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. కలలో కూడా ఊహించని 11 సీట్లకు పరిమితం అయ్యారు. అంతేకాదు ఈ సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఈ క్రమంలో ఓటమికి కారణాలు తెలుసుకుని, పార్టీ శ్రేణులకు దగ్గరవడానికి, కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి సంక్రాంతి తర్వాత అడుగుపెడుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు మాత్రం అభివృద్ధి, సంక్షేమం ఎలా చేయాలి? అనేదానిపై ముందుకెళ్తున్నారు. మొత్తానికి అటు రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా కోటి ఆశలతో, కొత్త ఊహలతో సరికొత్త వ్యూహాలు రచిస్తూ అడుగుగులు ముందుకేస్తున్నారు.
విజన్ 2047
ఏపీని ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం అంటూ రెండు కలల ప్రాజెక్టులు నెరవేర్చడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ రెండు తనకు రెండు కళ్ళు అని చెబుతుంటారు. వీటితో పాటు కొన్ని అంశాలతో కూడిన 2024ను 2047 విజన్ అంటూ తీర్చిదిద్దే ప్రయత్నం కూడా నడుస్తోంది. బాబు అంటేనే విజన్, అభివృద్ధి అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే.. కలల ప్రాజెక్టులు, విజన్ 2047 టార్గెట్ గా ముందుకెళ్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే అటు పోలవరం పనులు.. ఇటు రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 అక్టోబరు నెలలోపు పోలవరం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు సీఎం. ఇక అమరావతి పనులు జనవరి నుంచీ షురూ అవుతాయని మంత్రులు మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ చెబుతూనే వస్తున్నారు. దీనికి తోడు తవ్రలోనే కేంద్రం ప్రవేశ పెట్టబోయే 2025-26 బడ్జెట్ లో బాగా నిధులు సంపాదించగలిగితే ఆయన కన్న కలలు కచ్చితంగా సక్సెస్ అయినట్టే. 2025లో చంద్రబాబుకు ఇదొక ఛాలెంజ్.
వస్తున్నా.. మీ కోసమే వస్తున్నా..!
2024లో వైసీపీకి మాత్రమే కాదు.. వైఎస్ ఫ్యామిలీకి ఏ మాత్రం కలిసిరాలేదు అని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ ఓటమి, నేతలు జంపింగ్, సొంత ఇంట్లో కొట్లాటలు, ఆస్తి వివాదాలు, ఒకప్పుడు అన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయ్యి.. ప్రత్యర్థులను వదిలి, అన్నకే గుచ్చుకుంటోంది. దీంతో ఇలా వరుసగా ఇంటా.. బయట.. పార్టీలో దెబ్బలు తగలడంతో విలవిల్లాడుతున్నారు. దీనికి తోడు ఎక్కడికక్కడ కార్యకర్తలు, నేతల అరెస్ట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే పోయినచోటే వెతుక్కోమనే సామెతలా జగన్ ప్రస్తుతం ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి బలం పుంజుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సంక్రాంతి తర్వాత నేనున్నాను అంటూ పార్టీకి, అభిమానులకు భరోసా ఇవ్వడానికి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజల పక్షాన.. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి రంగం సిద్ధం చేశారు.
ఎవరికి ఆదరింపు..?
ఇక అటు చంద్రబాబు.. ఇటు వైఎస్ జగన్ ఇద్దరిలో జనాల్లో ఎవరికి ఎంత సపోర్టు ఉంటుంది? ఆరు నెలలకే జనాల్లోకి వస్తున్న జగన్ రెడ్డిని జనాలు ఆదరిస్తారా..? లేదా సూపర్ సిక్స్ అంతంత మాత్రమే అమలు చేస్తూ పోలవరం, అమరావతి అంటూ ముందుకెళ్తున్న చంద్రబాబుకు జై కొడతారా..? ఈ ఏడాది మొత్తం ప్రజల మధ్య ఉండాలని భావిస్తున్న జగన్ రెడ్డిని అక్కున చేర్చుకుంటారో.. చివరికి ఏపీ గేమ్ చేంజర్ అవుతారో చూడాలి మరి.