కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశాడు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పనిమంతుడా..? కాదా? ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తాం. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి అనేది తర్వాత చర్చ చేస్తామని మనసులో మాటను బయటపెట్టారు. సోమవారం చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన పవన్.. నాగబాబుకు తన సోదరుడిగా కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదని, తనతో సమానంగా పనిచేశారని స్పష్టం చేశారు.
నాకు తెలియదు..!
నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా, ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేష్‌ది ఏ కులమో ఇప్పటికీ నాకు తెలియదు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత.. నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను, వారసత్వంగా చూడలేం. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్‌లోకి నాగబాబును తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అందరికీ ఒక్కటే..
అంతకు ముందు బన్నీ అరెస్టుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదన్నారు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారని, చట్టం ఎవరి చుట్టం కాదని తేల్చి చెప్పారు. రేవంత్ పాలనపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు కూడా. రేవంత్ రెడ్డి బలమైన నేత అని, అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారని చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. రేవంత్ రెడ్డి తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని బన్నీని ఒకింత విమర్శిస్తూ.. రేవంత్ రెడ్డిని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దీంతో మెగాభిమానులు, అల్లు అర్జున్ వీరాభిమానులు లేనిపోని అనుమానాలతో నలుగుతున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు తిట్టిపోస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఆహా.. ఓహో సూపర్బ్ అని చెప్పుకుంటున్నారు.