టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయం పెను సంచలనం అయ్యింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో, సినీ ఇండస్ట్రీలో ఇదొక పెద్ద బర్నింగ్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ బన్నీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. సోమవారం పవన్ కళ్యాణ్ - నిర్మాత దిల్ రాజు భేటీ తరవాత చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తావన వచ్చింది. అల్లు అర్జున్ అంశంలో గోటితో పొయ్యే అంశానికి గొడ్డలి దాకా తీసుకొచ్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వైసీపీలా వ్యవహరించలేదు. తెలంగాణ ప్రభుత్వం బినిఫిట్ షోకు అనేక ఆంక్షలు విధించింది. డబ్బులు పెంచక పోతే రికార్డ్స్ ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు.
అవును తప్పే..!
నాపై కేసు నమోదు అయినా కూడా నేను అడ్డుపడలేను. రేవంత్ రెడ్డిని కొన్నేళ్లుగా మేం చూస్తూనే ఉన్నాం. సినిమా పరిశ్రమ కోసం అన్ని అవకాశాలు కల్పించారు. సినిమా అనేది యూనిట్ గా తీసినప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు అందరు బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి కాబట్టే హీరోను అరెస్టు చేయగలిగారు. కనీసం బాధిత కుటుంబం మూడో రోజు అయినా హీరోగా అల్లు అర్జున్ వెళితే బాగుండేది. అల్లు అర్జున్ అంశంలో అధికారులను ఇబ్బంది పెట్టడమే. సినిమా హాలులో పోలీసులు వచ్చి, చెప్పిన విషయాన్ని బన్నీకి సిబ్బంది ఎందుకు చెప్పలేదు.. చెప్పాల్సింది కదా? చట్టం అనేది అందరికీ సమానమే. బాధితుల కుటుంబానికి హీరోకు తెలియకుండానే, సినిమా యూనిట్ వెళ్లి భరోసా ఇస్తే బాగుండేది అని బన్నీ, అతని సిబ్బందిపై పవన్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
అందుకే వెళ్లను..!
పరిస్థితులు చూస్తున్నాను కాబట్టి నేను అందుకే సినిమా థియేటర్లకు వెళ్లను. సినిమా బాగునప్పుడు ప్రజల మన్ననలు చూడటానికి మాత్రమే నేను వెళ్తాను. ప్రజల నుంచి వచ్చే స్పందన వెలకట్టలేని అంశం. సినిమా హాలుకు వెళ్లి చూడటం అనేది అందరూ చెయ్యడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో హీరోలు సినిమాలకు వెళ్లి చూసే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే బన్నీపై ఆగ్రహం, విమర్శలు.. రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.