టాలీవుడ్ ఇండస్ట్రీ సంక్రాంతి వస్తే చాలు ఎనలేని ఉత్సాహం. మిగిలిన పండుగల్లో కెళ్లా ఇది సినీ పరిశ్రమకు ఎంతో స్పెషల్. అందుకే సీనియర్, జూనియర్ హీరోలు సంక్రాంతి రేసులో నిలిచి గెలవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా టికెట్లు, బెనిఫిట్ షోలు గట్రా గట్టిగానే పెంచేస్తుంటారు. అయితే ఇవన్నీ ఏమీ ఉండవని, బెనిఫిట్ షో మాట మాట్లాడొద్దని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అసెంబ్లీ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి బల్లగుద్ధి మరీ చెప్పేశారు. పుష్ప-2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరు చావు బతుకుల మధ్య ఉన్నారు. దీంతో తెలంగాణలో బెనిఫిట్ షోలు అనేవి లేకుండానే పోయాయి. ఇప్పుడిక ఉన్నదల్లా ఒకే ఒక్క ఆశ ఆంధ్రప్రదేశ్‌పైనే.
ఇక్కడ పాయే..!
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ఎక్కువ దిల్ రాజువే. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఆయన.. రాష్ట్రంలో బెనిఫిట్ షోల విషయంలో పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చేలా చాలా ప్రయత్నాలే చేశారు కానీ, ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో టాలీవుడ్ అంటే చాలు ప్రభుత్వం ఒంటికాలిపైన లేస్తున్న పరిస్థితి. దీంతో ఆ కోపాన్ని తగ్గించి రేవంత్ రెడ్డిని కూల్ చేయడానికి దిల్ రాజు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరికి హీరోలు, నిర్మాతలు, దర్శకులను తీసుకెళ్లి మరీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గని రేవంత్.. బెనిఫిట్ సమస్యే వద్దని తేల్చి చెప్పారన్నది బయట నడుస్తున్న టాక్. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు దిల్ రాజు.
ఏం చేస్తారో..?
సీఎం చంద్రబాబు తర్వాత కీలక స్థానంలో, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్.. టాలీవుడ్‌కు శుభవార్త చెబుతారని ఎంతో ఆశగా దర్శక, నిర్మాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ కాబోతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించడంతో పాటు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు, ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరగనుంది. అయితే బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పవన్.. గేమ్ ఛేంజ్ చేస్తారా? లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పవన్ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి, సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు చెందిన మంత్రి దగ్గరే ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద విషయమేమీ కానే కాదు. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని.. ఇక్కడ కూడా అమలు చేస్తారా లేదా అన్నది చూడాలి.