సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చోటు చేసుకున్న, ఇంకా కంటిన్యూ అవుతున్న పరిణామాల నేపథ్యంలో బన్నీ మేనమామ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం కడప పర్యటనలో భాగంగా పవన్ మాట్లాడుతుండగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్న సంధించారు. దీనిపై పవన్ చాలా లాజికల్, అయిష్టంగా బదులు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై పవన్ పట్ల బన్నీ వీరాభిమానులు, కార్యకర్తలు ఒకింత అసంతృప్తి, అంతకు మించి అగరహానికి లోనవుతున్న పరిస్థితి.
ఏం మాట్లాడుతాం చెప్పండి?
ఇది సంబంధం లేని ప్రశ్న అని సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ దాటవేశారు. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడుతాం..? అని మీడియాకే పవన్ కళ్యాణ్ ఎదురు ప్రశ్న సంధించారు. ఇంతకన్నా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని ఒకింత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో కనీసం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని కానీ, లేదంటే నో కామెంట్స్ అని చెప్పి ఉంటే సరిపోయేది. కానీ పవన్ మాత్రం.. మనుషులు చనిపోతే ఏం మాట్లాడతాం అనడం ఏంటి..? ఆయన పనికట్టుకుని ఏమైనా చంపారా..? అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కోపం తగ్గలేదా..?
వాస్తవానికి బన్నీ - పవన్ కళ్యాణ్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవని ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఎన్నికల ముందు నంద్యాల వెళ్లి మద్దతు ప్రకటించడంతో పవన్ సీరియస్ అయ్యారని.. అప్పటి నుంచి అస్సలు బన్నీ మాట ఎత్తితే చాలు కోపం నషాళానికి ఎక్కుతోందట. అందుకే అరెస్ట్ తరవాత.. ఆయన ఈయన్ను కలుస్తారని.. లేదు లేదు ఈయన్ను ఆయనే కలుస్తారని హడావుడి జరగ్గా చివరికి అదేమీ జరుగలేదు. సో.. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు పవన్ ఇలా కామెంట్స్ చేయడం కూడా అందులోనే భాగమే అని బన్నీ ఫ్యాన్స్, సినీప్రియులు, విమర్శకులు చెప్పుకుంటున్నారు.