తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఈ-కార్ రేసింగ్ ఉచ్చు బిగుస్తోంది. ఎపుడు ఏం జరుగుతుందో..? కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారనే ఆందోళన గులాబీ పార్టీ శ్రేణులను వెంటాడుతోంది. అరెస్ట్ తర్వాత జరిగే పరిణామాలపైనా కారు పార్టీ కంగారు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఈ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసులో ఈడీ పేర్కొంది.
వాళ్లకు కూడా..!
మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తున్నది. కాగా, పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఎఫ్ఈవోకు రూ.55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు వివరాలను ఈడీకి ఏసీబీ అధికారులు అందజేశారు. మరోవైపు ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏసీబీ ఈడీకి అందజేసింది.
కౌంటర్ దాఖలు
శనివారం ఉదయం నోటీసులు ఇచ్చిన క్రమంలో, మధ్యాహ్నానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కౌంటరులో పలు కీలక అంశాలను ఏసీబీ ప్రస్తావన చేసింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని అందులో ఏసీబీ పేర్కొన్నది. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని, అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు రూ. 55 కోట్లు బదిలీ చేశారని ఏసీబీ, ఈడీ పేర్కొన్న పరిస్థితి. తద్వారా హెచ్ఎండిఏకు రూ. 8 కోట్లు అదనపు భారం పడిందని కూడా తెలిపింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అని, కేటీఆర్ వేసిన పిటిషన్ విషయంలో విచారణ అర్హత లేదని ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.
ఏం చేయాలి..?
అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీబీ తెలిపింది. రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామనడం సరైనది కాదని, మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ అన్నిటినీ ఉల్లంఘించారని కౌంటరులో ఏసీబీ నిశితంగా వివరించింది. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు తానే చెప్పారని, ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయలని కోరడం సరైంది కాదని చెప్పింది. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే, కేసు నమోదు చేయవచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని కౌంటర్ లో ఏసీబీ పేర్కొంది. ఇప్పుడు కేటీఆర్ ఏం చేయబోతున్నారు..? అరెస్ట్ కాక తప్పదా..? లేదంటే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా..? అనేది చూడాలి మరి.