అవును.. టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, కార్యకర్తలు హద్దు మీరుతున్నారు. కనీసం ఎక్కడ ఏం మాట్లాడాలో..? ఎలాంటి నినాదాలు చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. పవన్ ఎక్కడ పర్యటించినా సరే వాళ్ళ గోల వాళ్ళదే ఐపోతోంది. అరే డిప్యూటీ సీఎం ఎందుకు వచ్చారు? ఆయన ఏం మాట్లాడుతున్నారు? మనం ఎలా ప్రవర్తించాలి..? అనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో విసిగి వేసారిన పవన్ మీకో దండం బాబూ అంటూ కొన్ని సార్లు నవ్వుకున్నా, చాలా సార్లు ఇబ్బంది పడ్డారు.
ఇంకెన్నిసార్లు..?
డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఎంత బిజిబిజీగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు జిల్లాల పర్యటన, ఇటు పార్టీ బలోపేతం.. ఇంకోవైపు తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేయడం.. ఇవన్నీ ఒక ఎత్తయితే తాను ఇదివరకు సంతకం చేసిన సినిమా షూటింగ్స్ పనుల్లో నిమగ్నం అయ్యారు. దీంతో పాటు ఎక్కడ ఏ అధికారికి ఎలాంటి కష్టం వచ్చినా.. నేతలకు ఇబ్బందులు వచ్చినా వాలిపోతున్నారు. ఈ పరిస్థితుల నడుమ హడావుడి చేసినా, చిరాకు తెప్పించే పనులు చేసినా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కోపం నషాళానికి ఎక్కింది.. తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఊగిపోయారు.
ఎప్పుడేం చేయాలో తెలియదా?
కూటమి ప్రభుత్వం పెంచిన కరెంట్ చార్జీల విషయంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టగా.. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జవహర్ కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన్ను శనివారం ఉదయం పరామర్శించిన పవన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా? ఖబడ్దార్ అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఓజీ.. ఓజీ.. అంటూ అభిమానులు, కార్యకర్తలు స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఒకింత ఆగ్రహం, అంతకు మించి అసహనం వ్యక్తం చేసారు. ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు.. పక్కకు రండి అని పవన్ చిరాకు పడ్డారు.
మినిమం ఉండాలిగా..!
కాస్త ఆచి తూచి.. తెలుసుకుని ప్రవర్తించకపోతే ఎలా..? ఒకప్పుడు ఆయన హీరో.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే విషయం తెలుసుకోవాలి కదా..! ఆయన వచ్చింది పరామర్శకు అనే విషయం మరిచిపోతే ఎలా..? కనీసం జ్ఞానం లేకుండా ఏది పడితే అది వాగితే.. ఇష్టానుసారం నినాదాలు.. అరుపులు, కేకలు వేస్తే ఎలాగా..? అవును ఓజీ సినిమాలో నటిస్తున్నారు సరే.. అవన్నీ ఎప్పుడు మాట్లాడాలి..? ఎక్కడ మాట్లాడాలి..? అనేది తెలుసుకోవాలిగా. ఇలా ఎక్కడ పడితే అక్కడ కోపం, అసహనం, చిరాకు తెప్పిస్తే ఎలా..? బహుశా పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు మానేస్తే కానీ ఈ గోల ఉండదేమా మరి.