ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేశాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పవన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఐతే పవన్ పర్యటన ఆసాంతం ఆయన వెంటే నకిలీ ఐపీఎస్ ఉన్నాడు. భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చాడు కేటుగాడు. పవన్ కళ్యాణ్ వై కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఐతే ఇంత హోదాలో ఉన్న నాయకుడి దగ్గరే నకిలీ ఆఫీసర్ తిరగడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, పర్యటన మొత్తం పవన్ వెంటే తిరగడంలాంటి పనులు చేయడమంటే మామూలు విషయం కానే కాదు.
నిఘా వర్గాలు ఏమయ్యాయి..?
ఒక ఎమ్మెల్యే వేరే ప్రాంతంలో పర్యటన ఉండంటేనే ఉరుకులు, పరుగులు పెట్టే పోలీస్ వ్యవస్థ, నిఘా వర్గాలు.. డిప్యూటీ సీఎం హోదాలోని లీడర్, అందులోనూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేప్పుడు ఎలా ఉండాలి? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? నిద్ర మత్తులో ఉన్నాయా..? బందోబస్తుకు ఎవరెవరు వెళ్తున్నారు? లోకల్ పోలీసులు ఎవరు? సెక్యూరిటీగా ఉన్నవాళ్లు ఎవరు? అనేది తెలియకపోతే ఎలా? హోం శాఖ ఇవన్నీ తెలుసుకోకుండా ఏం చేస్తున్నట్టు? అని జనసైనికులు, పవన్ వీరాభిమానులు ప్రభుత్వం, హోంశాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలే నక్సల్స్ ఉన్న ప్రాంతాల్లో..!
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయనకు పలుమార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం, మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడం ఇప్పటి వరకూ మనం చూశాం. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఒకింత డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా హోం శాఖ, నిఘా వర్గాలు వ్యవహరించాల్సింది పోయి ఇలా లైట్ తీసుకోవడం ఎంతవరకూ సబబు? పవన్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కాబట్టి సేఫ్.. జరగకూడనిది ఏదైనా జరిగి అంటే బాధ్యత ఎవరిది..? అనే ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు. ఇకనైనా హోం శాఖ, నిఘా వర్గాలు మొద్దు నిద్ర నుంచి లేచి పవన్ ఒక్కరనే కాదు ప్రజాప్రతినిధుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పవన్ ఏమంటారు?
గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యానని, ట్రైనింగ్ లో భాగంగా పవన్ పర్యటనలో పాల్గొన్నట్లు కూడా నకిలీ బిల్డప్ ఇచ్చుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో సూర్య ఉన్నాడు. మరోవైపు డిప్యూటీ సీఎం భధ్రతా లోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు హోం మంత్రి ఆదేశించారు. అసలే శాంతి భద్రతల విషయంలో ఇది వరకే ఆందోళన వ్యక్తం చేసిన వ్యక్తం చేశారు. అప్పట్లో అదొక సంచలనమే అయ్యింది. ఐతే ఇప్పుడు సేనానికే ఇలా జరగడంతో ఆయన స్పందన ఎలా ఉంటుంది..? ఏం మాట్లాడుతారు? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.