తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీకి మెగాస్టార్ చిరంజీవి రాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదు..? ఇంత పెద్ద కీలక సమావేశానికి రావకపోవడం ఏంటి? ఆయన హైదరాబాద్ నగరంలోనే ఉన్నప్పటికీ ఎందుకు హాజరు కాకపోవడం, ఒకరోజు ముందు తన ఇంటి స్విమ్మింగ్ పూల్ ముందు దిగిన స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరి మరుసటి రోజు జరిగిన సినీ పెద్దల సమావేశానికి ఆయన రాకపోవడం ఏంటి? ఇప్పుడిదే అటు టాలీవుడ్.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అంతే కాదు సోషల్ మీడియాలో ఐతే ఇక మాట్లల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అదీ పరిస్థితి.
ఎందుకనీ..?
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ వేదికగా జరిగిన సమావేశంలో సినీ ప్రముఖులు నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్స్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు.. ఆ తర్వాత ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. చిరంజీవి ఎందుకు రాలేదు..? ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారా..? నిన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు..? ఇవాళ ఎందుకు రాలేదు..? అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. సీనియర్ హీరోలు అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్ వచ్చినా చిరు, బాలయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు.. కనీసం వినిపించలేదు. భేటీ తరవాత కానీ, ముందు కానీ సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు కూడా లేవు.
అల్లు తప్ప.. ఒక్కరూ లేరేం..?
చిరు సంగతి అటుంచితే కనీసం మెగా కాంపౌండ్ నుంచి ఒక్కరంటే ఒక్కరూ రాకపోవడం గమనార్హం. రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, అల్లు అర్జున్ కూడా ఎక్కడా కనిపించలేదు. చెర్రీ, తేజ్, వరుణ్ పేర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరూ హాజరు కాలేదు. మెగా, అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చింది ఒకే ఒక్కరు ఆయనే అల్లు అరవింద్. ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. తెలుగు నిర్మాతలకు ఈ రోజు శుభదినం అని, ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతే కాదు సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
ఏమై ఉంటుంది..?
చిరు రాకపోవడంతో చిత్ర విచిత్రాలు చర్చ జరుగుతోంది.. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకోవడం, మాట్లాడటం, మాట్లాడుకోవటం ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. చిరు కావాలనే భేటీకి రాలేదా..? లేదంటే వేరే కానీ ఏమైనా ఉండి రాలేదా..? అసలు ఆయన సిటీలో ఉన్నారా..? లేదా..? ఈ గోల అంతా ఎందుకు ప్రత్యేకంగా వెళ్లి కలవాలని భావిస్తున్నారా..? అనేది తెలియట్లేదు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి తోడు ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. సభ్యత్వం కూడా ఆ పార్టీలోనే ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ మనిషే. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు..? అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది.