అవును.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిపారు. గురువారం సీఎంతో జరిగిన సినీ పెద్దల భేటీలో ప్రత్యేకించి మరీ ఈ ఇద్దరినీ ఒక్కటి చేశారు. హైడ్రా వచ్చీ రాగానే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, ఆ తర్వాత ప్రభుత్వం పట్ల నాగ్ తీవ్ర అసంతృప్తి, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వ్యక్తిగత మాటలు తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కొండా సురేఖ వర్సెస్ నాగ్ అన్నట్టుగా న్యాయస్థానాల్లో కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి.
సయోధ్య.. అంతే!
ఇప్పటివరకూ జరిగిన అన్ని విషయాల్లోనూ నాగార్జున ఇక సాగదీయకుండా, మరోసారి ఎలాంటి విభేదాలు అనేవి లేకుండా, ఇండస్ట్రీ పరంగా, తన వ్యాపారాల పరంగా రేవంత్ రెడ్డితో సయోధ్యనే నాగార్జున కోరుకున్నారని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో నాగార్జునను ప్రత్యేకంగా కలుసుకోవడం, సీఎంకు శాలువా కప్పడం, నమస్కరించడం, కరచాలనం, ఇద్దరూ నవ్వుకోవడం, ఎంతో ఆప్యాయంగా పలకరింపులు ఇవన్నీ చూస్తే అంతా ఇక వీరిద్దరూ కలిసిపోయారనే చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా నమస్కరించారు నాగ్. ముఖ్యంగా నాగ్ - రేవంత్ నవ్వుకుంటున్న, శాలువా కప్పిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సర్కారుకు రిక్వెస్ట్..
భేటీ తర్వాత యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని తన అభిప్రాయాన్ని సమావేశంలో నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే, సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరిక అని తెలిపారు. ఈ క్రమంలో కొందరు హీరోల్లాగే రాజకీయాల్లో తన వైఖరి విభిన్నం అని, తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. ఈ ఒక్క భేటీతో రేవంత్ - నాగ్ కలిసిపోయారన్న మాట. ఇక సోషల్ మీడియాలో ఈ కలయికను, గొడవలు, కూల్చివేతలు మరిచిపోయారా..? అని ప్రశ్నలు, విమర్శలు, అంతకు మించి తిట్లు, కామెంట్స్ ఇవన్నీ మామూలే.